న్యూఢిల్లీ, వెలుగు: అయోధ్య రామమందిర చందాల చోరీ వ్యవహారంలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) తీరు.. దొంగే దొంగా దొంగా అన్నట్టు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఫైరయ్యారు. భక్తుల నమ్మకాన్ని, శ్రీరాముడి పేరును రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే సంఘ్ పరివార్ వాడుకుంటున్నదని ఆరోపించారు. గతంలో సొంత అనుబంధ సంస్థ అయిన ‘నిర్మోహి అఖారా’నే వీహెచ్‌పీపై రూ.1,400 కోట్ల రామమందిర విరాళాల కుంభకోణం ఆరోపణలు చేసిందని గుర్తుచేశారు.
అలాంటి చరిత్ర ఉన్న సంస్థకు ప్రతిపక్షాలను ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిదని నిలదీశారు. తమ తప్పు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాలపై బురదజల్లేందుకు వీహెచ్పీ ప్రయత్నిస్తున్నదని సోమవారం ‘ఎక్స్’లో మండిపడ్డారు. సిట్ విచారణ కంటితుడుపు చర్యేనని, ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.
‘చందాల చోరీ’ లో అసలు పాత్ర దారుల నిగ్గు తేల్చాలని పోరాడుతున్న విపక్ష నేతలపై విచారణ చేపట్టాలని వీహెచ్పీ లేఖలు రాయడమేంటని ప్రశ్నించారు. ‘మందిరం పేరిట జరుగుతున్న కుంభకోణాన్ని ప్రశ్నించినందుకు ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్‌పై విచారణ జరపాలని లేఖ ద్వారా పోలీసులను కోరడం హాస్యాస్పదం’ అంటూ ట్వీట్ చేశారు.
