- తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించిన ట్రస్ట్ బోర్డు
- రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక భేటీలో నిర్ణయం
- చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాకు ఆమోదం
అయోధ్య: రామ మందిర విరాళాల దుర్వినియోగం, నిధుల చోరీ వివాదాల నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం అయోధ్యలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించింది. వీరి స్థానంలో తాత్కాలికంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ట్రస్టు సభ్యుడు కృష్ణ మోహన్ కు అప్పగించింది. రామాలయ విరాళాల నిధుల దోపిడీపై దర్యాప్తు వేగవంతం కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది. ప్రియాంక గాంధీ, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ వంటి నేతలు విరాళాల సేకరణలో పారదర్శకతపై నిలదీయగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబొలే కూడా ట్రస్ట్‌లో సంస్థాగత సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే చంపత్ రాయ్ మాజీ డ్రైవర్‌తో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, సమావేశం అనంతరం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రామ మందిరంలో చోరీ ఘటనపై ట్రస్ట్ తీవ్రంగా బాధపడిందని తెలిపారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న సమావేశం కావాలని ట్రస్ట్ కార్యవర్గం ముందుగా నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారమే భేటీ నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. సిట్ సమర్పించే తుది నివేదికపై చర్చించేందుకు ఈ నెల 22 మరోమారు సమావేశం నిర్వహిస్తామని ఆయన వివరించారు. మరోవైపు, ట్రస్ట్ బోర్డులో జరిగిన ఈ భారీ ప్రక్షాళన చర్యలు, భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి, భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టడానికి తీసుకున్న నిర్ణయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తీవ్రంగా కలచివేసింది: దాస్
ఈ వివాదంపై రామ మందిర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘శ్రీరాముని ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు చోరీకి గురికావడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ పాపానికి పాల్పడిన వారు ఎవరైనా సరే, వారికి అత్యంత కఠినమైన శిక్ష పడాలి’ అని ఆయన స్పష్టం చేశారు.
