- రెండున్నర దశాబ్దాల పిటిషన్లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఎర్రగడ్డలోని బహలూల్‌ఖానాగూడ (ఎర్రగడ్డ ఆస్పత్రి) పరిధిలోని 1.31 ఎకరాలు, 1.20 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ భూమిని ప్రభుత్వం లీజుకు తీసుకుందని, కాబట్టి దీనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలంటూ గతంలో కింది కోర్టు ఇచ్చిన డిక్రీని రద్దు చేసింది. రఫత్ ఉన్నీసా బేగం తరఫున ఐదుగురు, అలాగే ఖాన్ బహదూర్ సయ్యద్ అలి ఖాసిం వారసుల నుంచి భూమి కొనుగోలు చేశామంటూ చంద్రశేఖర్‌రావుతో పాటు మరో 29 మంది ప్రైవేట్ వ్యక్తులు గతంలో కింది కోర్టును ఆశ్రయించారు.
వారికి అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర దశాబ్దాల క్రితం హైకోర్టులో వేర్వేరు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. కేవలం రెవెన్యూ రికార్డుల్లో చేసిన మార్పులు చేర్పుల ఆధారంగా భూములపై హక్కులు రావని, హక్కులను నిరూపించుకోవడానికి బలమైన ఆధారాలుండాలని స్పష్టం చేస్తూ కింది కోర్టు తీర్పులను కొట్టివేసింది. నిజాం నాటి లీజు పత్రం చట్టప్రకారం లేదని, కేవలం ఒక కాపీ ఆధారంగా భూమిపై హక్కులు పొందలేరని హైకోర్టు తేల్చి చెప్పింది.
అసలు భూమిపై హక్కులే లేని వ్యక్తి నుంచి కొనుగోలు ఒప్పందం చేసుకున్నంత మాత్రాన కొనుగోలుదారుకు ఎలాంటి హక్కులు లభించవని న్యాయస్థానం స్పష్టం చేసింది. విక్రేతకు ఆ భూమిపై పూర్తి హక్కులున్నట్లు రుజువు చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారుపైనే ఉంటుందని పేర్కొంది.
సర్వే నెం.127/1 భూమి ప్రభుత్వ పోరంబోకు స్థలంగా రికార్డుల్లో ఉందని హైకోర్టు గుర్తుచేసింది. జాగీరు రద్దు తర్వాత ఆ భూములన్నీ ప్రభుత్వానికే చెందుతాయని, వాటిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ప్రభుత్వ భూముల విషయంలో కింది కోర్టులు తీర్పులు ఇచ్చేటప్పుడు వాదనలకే పరిమితం కాకుండా కీలకమైన రికార్డులను పరిశీలించాలని సూచిస్తూ, ప్రభుత్వ అప్పీళ్లను అనుమతించింది.
