‘బ్లిస్’ అనుమతుల తనిఖీలు.. హుస్సేన్సాగర్ FTL పరిధిలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు ? 

‘బ్లిస్’ అనుమతుల తనిఖీలు.. హుస్సేన్సాగర్ FTL పరిధిలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు ? 
  • ఫిర్యాదు చేసిన ఇరిగేషన్​.. చెక్​ చేసిన కమిషనర్లు, కలెక్టర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నెక్లెస్ ​రోడ్ ​రైల్వే స్టేషన్​ను ఆనుకుని ప్రదీప్ కన్‌‌స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న కట్టడాలను అనుమతులు లేవని, అది హుస్సేన్​సాగర్​ ఎఫ్టీఎల్ ​పరిధిలో ఉందని ఇరిగేషన్​శాఖ ఫిర్యాదు మేరకు బల్దియా, హైడ్రా కమిషనర్లతో పాటు కలెక్టర్​సోమవారం తనిఖీలు చేశారు.

నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ కి అనుకుని రెండెకరాల్లో రెండు టవర్లలో ప్రదీప్ కన్​స్ట్రక్షన్స్​సంస్థ 153 ఫ్లాట్స్ నిర్మిస్తోంది. పనులు కూడా పూర్తికావొచ్చాయి. ఈ తరుణంలో ఇరిగేషన్​శాఖ తమ అనుమతులు తీసుకోలేదని కంప్లైంట్​చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్​ఆర్వీ కర్ణన్​, హైడ్రా కమిషనర్​రంగనాథ్​, కలెక్టర్​ప్రియాంక ఆల సైట్​కు వెళ్లారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. పర్మిషన్ లేకుండా కడుతున్నట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని, అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలిస్తున్నామని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వలేదని, కానీ, 2018లో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయని నిర్మాణదారులు చెప్తున్నారని, వాటిని చెక్​చేస్తున్నట్లు చెప్పారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ ఎన్ వోసీ  లేకుండా నిర్మిస్తున్నట్లు గుర్తించామన్నారు. హుస్సేన్ సాగర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని, దాని ప్రకారం ఇది ఎఫ్టీఎల్​పరిధిలో ఉందా లేదా అన్నది తేలుతుందని పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం జీహెచ్ఎంసీని ఆశ్రయించగా ఇదంతా బయటకు వచ్చిందని తెలిపారు.