యాదాద్రి జిల్లాలో 41 చేనేత సంఘాల్లో 23 ఏకగ్రీవం

యాదాద్రి జిల్లాలో 41 చేనేత సంఘాల్లో 23 ఏకగ్రీవం
  •     అభ్యర్థులు ఖరారు, గుర్తుల కేటాయింపు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో 41 చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్​ జారీ చేయగా, 23 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలో 42 చేనేత కార్మిక సంఘాలు ఉండగా, ఆలేరులో సొసైటీ సభ్యత్వాల అంశంలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో మిగిలిన సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్​ జారీ అయింది. ఎన్నికలు జరుగుతున్న 41 సంఘాలకు జనరల్​ కేటగిరిలో 532 మంది, మహిళా కేటగిరిలో 138 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం 142 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, 23 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. 

దీంతో 18 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా సంఘాల్లో 332 మంది డైరెక్టర్లుగా పోటీ చేస్తున్నారు. వీరందరికీ పేర్ల ప్రకారం గుర్తులు కేటాయించారు. మోత్కూరు సంఘంలో 24 మంది డైరెక్టర్లుగా పోటీలో ఉన్నారు. 10న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్​ జరుగుతుంది. సాయంత్రం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.