పులిచింతల జెన్ కో వద్ద ఆందోళన.. ఉద్యోగాల నుంచి తొలగించారంటూ కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా

పులిచింతల జెన్ కో వద్ద ఆందోళన.. ఉద్యోగాల నుంచి తొలగించారంటూ కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా
  • ఉద్యోగాల నుంచి తొలగించారంటూ కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జెన్ కో ఆఫీస్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించారంటూ పెట్రోల్ బాటిళ్లతో ధర్నా చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళ్తే... పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో జెన్ కో పవర్ ప్లాంట్ కోసం వజినేపల్లి, బుగ్గమాదారం గ్రామాలకు చెందిన రైతుల భూములు తీసుకున్నారు. దీంతో ఆ రైతు కుటుంబాలకు జెన్ కో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ హామీ అమలుకాకపోవడంతో కాంట్రాక్ట్  ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు గతంలోనే ఆందోళనలు చేపట్టడంతో పాటు కోర్టుకు సైతం వెళ్లారు.

ఈ క్రమంలో కాంట్రాక్ట్ రెన్యూవల్ కాలేదన్న కారణంతో ఇటీవల ఆరుగురు ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచారు. దీంతో వారు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం జెన్ కో ఆఫీస్ వద్దకు చేరుకొని గేటు ముందు బైఠాయించి, పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆఫీస్ వద్దకు వచ్చి ధర్నా చేస్తున్న వారిని స్టేషన్ కు తరలించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేసే వరకు ఆందోళన చేస్తామని బాధితులు స్పష్టం చేశారు.