గాంధీ నగర్: 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జిల్లా కోర్టు తీర్పును సమర్థిస్తూ.. 38 మంది దోషులకు ఉరిశిక్ష, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ వరుస పేలుళ్ల కేసులో మృతులైన 56 మంది కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన 200 మందికి పైగా బాధితులకు రూ. 1 లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు:
2008, జూలై 26న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కేవలం 70 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్ నగరవ్యాప్తంగా నివాస ప్రాంతాలు, మార్కెట్లు, ప్రజా రవాణా వ్యవస్థలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని 21 బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమంలో 56 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు.
ఈ దాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ (హుజీ) ప్రకటించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2022, ఫిబ్రవరిలో అహ్మదాబాద్ జిల్లా కోర్టు వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం 77 మంది నిందితులలో 49 మందిని దోషులుగా తేల్చింది. ఇందులో 38 మందికి మరణశిక్ష.. 11 మందికి జీవిత ఖైదు విధించింది.
సరైన ఆధారాలు లేని కారణంగా మిగిలిన 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. జిల్లా కోర్టు తీర్పును నిందితులు గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదీ విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. భారత దేశ న్యాయ చరిత్రలో ఒకేసారి ఇంతమందికి ఉరిశిక్ష విధించడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.
