ధోనీ బర్త్‌డేకు తమిళనాడు సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్.. నెట్టింట పోస్ట్ వైరల్!

ధోనీ బర్త్‌డేకు తమిళనాడు సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్.. నెట్టింట పోస్ట్ వైరల్!

MS Dhoni, Thalapathy Vijay: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు (మంగళవారం) తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎక్స్ (X) వేదికగా ధోనీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రికెట్‌కు ధోనీ చేసిన విశేష కృషిని కొనియాడుతూ, తమిళనాడు ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని సీఎం విజయ్ తన సందేశంలో గుర్తు చేసుకున్నారు.  

సీఎం విజయ్ హార్ట్ టచింగ్ పోస్ట్: 
ముఖ్యమంత్రి విజయ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ధోనీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీ పేరు వినగానే మార్మోగే ప్రతి విజిల్ నుంచి, మీరు స్ఫూర్తినింపిన కోట్లాది హృదయాల వరకు.. మీ ప్రయాణం తమిళనాడు క్రీడా భావోద్వేగాలలో ఒక మధురమైన భాగంగా మారిపోయింది.. మన కెప్టెన్ కూల్.. మహేంద్ర సింగ్ ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు! మీ అసాధారణ క్రికెట్, ప్రశాంతమైన నాయకత్వం, వినమ్రత రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.. మీరు మంచి ఆరోగ్యం, సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం విజయ్ తెలిపారు. 

తమిళనాడులో ఎంఎస్ ధోనీ ఒక ఎమోషన్: 
* సీఎం విజయ్ చేసిన ఈ ట్వీట్ తమిళనాడులో ధోనీకి ఉన్న తిరుగులేని ప్రజాదరణను ప్రతిబింబిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీతో ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా ధోనీ అక్కడ ఒక క్రీడా ఐకాన్‌గా మారిపోయారు. తన అద్భుతమైన కెప్టెన్సీతో చెన్నై జట్టుకు ఎన్నో ఐపీఎల్ టైటిళ్లను అందించి, స్థానిక అభిమానుల నుంచి "తలా" అనే పేరును సొంతం చేసుకున్నారు.

* ఒకవైపు టీమిండియాకు ఎన్నో ఐసీసీ (ICC) ట్రోఫీలను అందించడం, మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దడం ధోనీకే సాధ్యమైంది. ఒత్తిడి సమయంలోనూ ప్రశాంతంగా ఉండే ఆయన తీరు, అద్భుతమైన లీడర్‌షిప్ క్వాలిటీస్ భారత క్రికెట్‌లో ఆయనను అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి. 45 ఏళ్ల వయసులోనూ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని, తమిళనాడు సీఎం పంపిన ఈ బర్త్‌డే విషెస్ ద్వారా మరోసారి రుజువైంది.