బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మరో సారి తన బోల్డ్ ఆలోచనలతో వార్తల్లో నిలిచింది. పెళ్లి ఎప్పుడు?, పిల్లలు ఎప్పుడు? అంటూ మహిళలపై సమాజం పెట్టే ఒత్తడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్ల క్రితమే తాను తన ఎగ్స్ ను ఫ్రీజ్ చేయించుకున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని చెబుతూ.. పెళ్లి చేసుకోవాల్సిందే .. పిల్లలు కనాల్సిందే అనే టైమ్ లైన్ కు నేను బందీ కావాలనుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
లేటెస్ట్ గా కృతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను జాతీయ అవార్డు అందుకున్న 'మిమి' సినిమా కోసం సిద్ధమవుతున్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ చిత్రంలో సరోగసీ నేపథ్యంలో పాత్ర పోషించాల్సి రావడంతో దాదాపు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. అదే సమయంలో హార్మోన్లలో మార్పులు రావడం, షూటింగ్‌కు రెండు నెలల విరామం ఉండటంతో ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం సరైన సమయంగా భావించానని చెప్పింది.
ఈ ప్రక్రియ అంత సులభం కాదని కూడా కృతి వివరించింది. 10 నుంచి 12 రోజుల పాటు హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ సమయంలో తీవ్రమైన మూడ్ స్వింగ్స్, శారీరక అసౌకర్యం ఎదురవుతాయని వెల్లడించింది. అయినప్పటికీ భవిష్యత్తుపై మానసిక ప్రశాంతత కోసం ఇది తనకు లభించిన అత్యుత్తమ బహుమతిగా భావిస్తున్నానని పేర్కొంది.
వైద్యుల సూచన ప్రకారం.. ఎగ్ ఫ్రీజింగ్ అనేది భవిష్యత్తులో గర్భధారణ అవకాశాలను భద్రపరచుకునే ఆధునిక వైద్య విధానం. మహిళ సిద్ధంగా ఉన్న సమయంలో ఆ ఎగ్స్‌ను ఉపయోగించి గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఇది ఆర్థికంగా అందుబాటులో ఉండదని.. తాను ఆ అవకాశం పొందిన అదృష్టవంతురాలినని కృతి చెప్పింది.
ప్రస్తుతం వరుస విజయాలతో కెరీర్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న కృతి సనన్.. మిమి, లుకా చుప్పి, బరేలీ కీ బర్ఫీ, క్రూ వంటి చిత్రాలతో నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం మహిళల ఆరోగ్యం, కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. 'జీవితం ఒక్కటే.. మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి' అనే కృతి సందేశానికి అభిమానులతో పాటు పలువురు మహిళలు కూడా మద్దతు తెలుపుతున్నారు.
