భారతీయ పెళ్లిళ్లు అంటేనే వైభవం, సంప్రదాయాలు, రంగురంగుల వేడుకలు, వందల రకాల వంటకాలు గుర్తుకొస్తాయి. ఇప్పటివరకు ఇవి కుటుంబాలు, బంధువులు, స్నేహితుల మధ్య జరిగే ప్రత్యేక కార్యక్రమాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు భారతీయ పెళ్లిళ్లు మరో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. కేవలం కుటుంబ వేడుకగా కాకుండా.. విదేశీ పర్యాటకులకు ఒక ప్రత్యేక సాంస్కృతిక అనుభవంగా మారుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే గెస్ట్స్ డబ్బులు చెల్లించి భారతీయ పెళ్లిలో భాగమయ్యే కొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, రచయిత సార్థక్ అహుజా ఈ కొత్త ట్రెండ్‌ను సోషల్ మీడియాలో వివరించారు. Join My Wedding, Desi Discoveries వంటి ప్లాట్‌ఫారమ్‌లు విదేశీ పర్యాటకులను భారతీయ పెళ్లిళ్లతో అనుసంధానం చేస్తున్నాయి. సాధారణంగా పర్యాటకులు చారిత్రక ప్రదేశాలు, వంటకాలను ఎక్స్‌ప్లోర్ కోసం భారత్‌కు వస్తుంటారు. ఇప్పుడు వారు నేరుగా భారతీయ పెళ్లిలో పాల్గొని అక్కడి సంప్రదాయాలను ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం పొందుతున్నారు.
ఈ వెడ్డింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో విదేశీ అతిథులు బారాత్‌లో పాల్గొనడం, సంగీత్ కార్యక్రమాలు చూడటం, సంప్రదాయ దుస్తులు ధరించడం, భారతీయ వంటకాలను ఆస్వాదించడం వంటి అనుభవాలను పొందుతున్నారు. వారికి ఇది కేవలం ఓ వేడుక కాదు.. భారతీయ సంస్కృతిని దగ్గరగా చూసే అరుదైన అవకాశంగా వారు భావిస్తున్నారు.
ఈ కొత్త విధానం పెళ్లి నిర్వాహకులకు కూడా ఆర్థికంగా ఉపయోగపడుతోంది. సాధారణంగా ఒక్కో అతిథి కోసం సుమారు 250 డాలర్లు అంటే రూ.21 వేల నుంచి రూ.24 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొంత భాగం ప్లాట్‌ఫారమ్‌కు, కొంత భాగం ట్రావెల్ గైడ్‌లకు వెళ్తుందట. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం పెళ్లి నిర్వహించే కుటుంబానికి చేరుతుంది. ఒక పెళ్లికి 10 నుంచి 15 మంది విదేశీ అతిథులు వస్తే.. పెళ్లి ఖర్చుల్లో కొంత భాగాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
ఈ ట్రెండ్‌లో రాజస్థాన్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. జైపూర్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్ వంటి ప్రాంతాలు ఇప్పటికే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ప్రసిద్ధి చెందాయి. అయితే ప్రతి కుటుంబం కేవలం డబ్బు కోసమే ఈ ఆలోచనను అమలు చేయటం లేదట. కొందరు తమ ప్రత్యేకమైన వేడుకలో విదేశీ గెస్ట్స్ పాల్గొనడం ద్వారా కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవాలని కోరుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఈ ట్రెండ్‌పై సరదా వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. పెళ్లి ఆహ్వానాలు ఇప్పుడు “ప్రీమియం ఈవెంట్ పాస్‌లు”గా మారుతున్నాయంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ నవ్వుల వెనుక ఒక పెద్ద మార్పు ఉంది. పర్యాటకులు ఇప్పుడు కేవలం ప్రదేశాలను చూడటమే కాకుండా.. స్థానిక లైఫ్ స్టైల్, సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమవ్వాలని కోరుకుంటున్నారు. ఆ మార్పులో భారతీయ పెళ్లిళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు ఒక అనుభవంగా మారుతున్నాయి.
