కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై బీఆర్ఎస్ సర్కార్‌ను ఏకిపారేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సీఎం రేవంత్.. కేసీఆర్ తన మెదడును రంగరించి, అహంతో ఇసుక మీద కట్టిన మేడిగడ్డ బ్యారేజ్.. ఏడాదిన్నరకే కుంగిపోయిందని ఆయన మండిపడ్డారు. తప్పులన్నీ తామే చేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. నిపుణుల కమిటీ నివేదికల ప్రకారమే తమ ప్రభుత్వం కాళేశ్వరంపై ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
గత వైఎస్సార్ హయాంలో తుమ్మడిహట్టి దగ్గర 16 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించేలా రూ. 38 వేల కోట్ల బడ్జెట్‌తో ‘ప్రాణహిత-చేవేళ్ల’ ప్రాజెక్టుకు డిజైన్ చేశారని రేవంత్ గుర్తుచేశారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. రీ-డిజైనింగ్ పేరుతో ఊరు మార్చి, పేరు మార్చి నిధులు కొల్లగొట్టారని ఆరోపించారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టవద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ హెచ్చరించినా కేసీఆర్ వినలేదన్నారు. తనకు నచ్చినట్లు ‘వ్యాప్ కోస్’ (WAPCOS) సంస్థతో నివేదిక ఇప్పించుకుని, ప్రాజెక్టు అంచనాలను రూ. 81 వేల కోట్లకు పెంచారని, చివరికి కాళేశ్వరం ఖర్చు రూ. లక్షా 47 వేల కోట్లకు చేరిందని కాగ్ (CAG) నివేదిక తేల్చిందని సీఎం పేర్కొన్నారు.
కేసీఆర్, హరీష్ రావు ఇంజనీర్లు కాదు.. నిజాలను మభ్యపెట్టే మ్యానుప్యులేటర్స్’ అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు క్వాలిటీగా కట్టి ఉంటే.. డబ్బులు తిన్నా కూలిపోయేది కాదు కదా అని ప్రశ్నించారు. 2020లో బ్యారేజీలో, 2022లో కన్నెపల్లి పంప్ హౌజ్‌లో వరదలకు గోడ కూలినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సరైన సాయిల్ టెస్టులు చేయకుండా, కేవలం నీళ్లు కనిపించాలనే ప్రచార ఆర్భాటం కోసం ఇసుక పునాదులపై బ్యారేజ్ కట్టి నీటిని నిల్వ చేయడం వల్లే బరువు పడి పిల్లర్లు కుంగాయని సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు.
