జర్మనీ ఎడ్యుకేషన్ వెరీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ...చదువు తక్కువ.. ప్రాజెక్టు వర్క్ ఎక్కువ

జర్మనీ ఎడ్యుకేషన్ వెరీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ...చదువు తక్కువ.. ప్రాజెక్టు వర్క్ ఎక్కువ
  •     ప్రాజెక్టు పూర్తి చేస్తేనే పట్టా.. రీసెర్చ్, ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌కే మొదటి ప్రాధాన్యత
  •     పరిశ్రమలే సిలబస్ డిజైనర్లు.. కాలేజీల్లోనే ల్యాబ్ సెటప్ 
  •     పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ స్టూడెంట్లే టీచర్లు.. డిగ్రీ అంటే ఒకే సబ్జెక్టు 
  •     రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
  •     విజయవంతంగా ముగిసిన 35 మంది సభ్యుల జర్మనీ పర్యటన 

హైదరాబాద్, వెలుగు:  జర్మనీ హయ్యర్ ఎడ్యుకేషన్ విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అక్కడ చదువులంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలు కాదు.. పూర్తిస్థాయి ప్రాజెక్టు వర్కులు, పరిశోధనలే ప్రాధాన్యమని రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనంలో గుర్తించింది. జర్మనీ, స్విజ్జర్లాండ్‌‌‌‌లోని విద్యా విధానం, అక్కడి నైపుణ్యాభివృద్ధి పద్ధతులను స్టడీ చేసేందుకు రాష్ట్రం నుంచి వెళ్లిన 35 మంది సభ్యుల విద్యాశాఖ ప్రతినిధి బృందం తమ 8 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుంది. జూన్ 28 నుంచి జులై 6 వరకు ఈ టూర్‌‌‌‌‌‌‌‌ సాగింది. అయితే, జర్మనీ పర్యటనలో గొట్టింజన్, ఆకెన్, మున్నిక్, స్టడ్​గార్డ్‌‌‌‌లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలతోపాటు మెర్సిడెస్ బెంజ్ కంపెనీని సందర్శించి కీలక అంశాలను టీమ్ పరిశీలించింది. 


క్యాంపస్‌‌‌‌లోనే అంతా.. నో అఫిలియేటెడ్ సిస్టమ్ 


జర్మనీలో యూనివర్సిటీల నిర్మాణం మనకంటే భిన్నంగా ఉంది. అక్కడ అఫిలియేటెడ్ కాలేజీల వ్యవస్థ లేదు. ఒకే వర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్‌‌‌‌డీ కోర్సులు నిర్వహిస్తారు. ఏడాదికి రెండు సార్లు (జూన్, అక్టోబర్) అడ్మిషన్లు తీసుకుంటారు. ప్రతి క్లాసులో కేవలం 15 నుంచి 20 మందికి మాత్రమే అవకాశం ఉండటంతో ల్యాబ్స్, ఇతర ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో ఉంటాయి. స్క్రీనింగ్ టెస్టు ద్వారానే ప్రవేశాలు కల్పిస్తారు. మెజారిటీ బోధన మాతృభాష అయిన జర్మన్‌‌‌‌లోనే సాగుతుంది. కేవలం కొన్ని వర్సిటీల్లో ఇతర దేశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఒకటి రెండు పీజీ కోర్సులను మాత్రమే ఇంగ్లిష్‌‌‌‌లో ప్రారంభించేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ రీసెర్చ్, ఇన్నోవేషన్లకు పెద్దపీట వేస్తారు.

  
డిగ్రీ అంటే ఒక్క సబ్జెక్టే.. 


యూజీలో మన దగ్గర ఉన్నట్టు నాలుగైదు సబ్జెక్టులు ఉండవు. మ్యాథ్స్ చదవాలంటే కేవలం మ్యాథ్స్  అంశాలే ఉంటాయి. దీనికి 180 క్రెడిట్స్ కేటాయిస్తారు. మైనర్ డిగ్రీలకు 60 క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు డిగ్రీ మధ్యలో బ్రేక్ తీసుకొని మైనర్ డిగ్రీలు లేదా రీసెర్చ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరి. ప్రాజెక్టును సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా కంప్లీట్ చేస్తేనే డిగ్రీ పట్టా ఇస్తారు.


పరిశ్రమల నిపుణులతో క్లాస్‌‌‌‌లు


జర్మనీలో బోధనా పద్ధతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. పీహెచ్‌‌‌‌డీ చేసే వాళ్లు పీజీ వాళ్లకు, పీజీ చేసే వాళ్లు యూజీ విద్యార్థులకు ట్యూటోరియల్స్ చెప్పాలి. ఇక రీసెర్చ్ కోసం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్జీవోలు, ఇండస్ట్రీలు భారీగా ఫండింగ్ ఇస్తాయి. పరిశ్రమలే కాలేజీల్లో ల్యాబులను ఏర్పాటు చేస్తాయి.  కొన్నిసార్లు కంపెనీల నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కింద నిపుణులు వచ్చి క్లాసులు చెబుతారు.


హైటెక్ క్లాస్ రూమ్‌‌‌‌లు..


క్లాస్ రూములు పూర్తిగా ఐసీటీ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌తో హైటెక్‌‌‌‌గా ఉంటాయి. రూము బయట ఉండే డిస్ ప్లే బోర్డుపై క్లాస్‌‌‌‌ టైమింగ్స్, ప్రొఫెసర్ల వివరాలు.. వాళ్లు చెప్పే పాఠాలు, హాజరయ్యే స్టూడెంట్ల లిస్ట్ కనిపిస్తుంది. బయోమెట్రిక్, రిజిస్టర్ అటెండెన్స్ లేకపోయినా స్టూడెంట్లు క్లాసులకు హాజరు కావాల్సిందే. ప్రస్తుతం అక్కడ రోబో సిస్టమ్స్ ఎక్కువగా వాడుతుండగా, ఏఐకి మాత్రం తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రతినిధి బృందం గుర్తించింది.