- అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం
- రూ.813 కోట్లను ఇంకా పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం
- ఖాతాల్లో నిధులున్నా ప్రాజెక్టుల పనులు ఆగిపోవడంపై అసంతృప్తి
- భూసేకరణ పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం సొమ్మును ప్రభుత్వ ఖాతాల్లోనే ఆపడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) కోసం ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన నిధులను వెంటనే బాధిత రైతులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్లు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఖాతాల్లో ఉన్న నిధులు ఇంకా రూ.813 కోట్లు పంపిణీ చేయకపోవడంపై మండిపడ్డారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, భూసేకరణ కమిషనర్ శివకుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పైసలియ్యండి.. లేదంటే వాపస్ పంపండి..
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో భూసేకరణ, పునరావాసం కింద దాదాపు రూ.3,101 కోట్ల విలువైన టోకెన్లు సమర్పించగా, ప్రభుత్వం రూ.2,504 కోట్లను విడుదల చేసిందని అధికారులు మంత్రికి వివరించారు. అయితే జిల్లాల స్థాయిలో ఇంకా రూ.813 కోట్లు పంపిణీ కాకుండా మిగిలి ఉన్నాయని తెలిపారు.
ఇందులో భూసేకరణ అధికారుల వద్ద రూ.502 కోట్లు, జిల్లా కలెక్టర్ల వద్ద మరో రూ.311 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా భూనిర్వాసితులకు చేరకపోవడం కలవరపెట్టే విషయమన్నారు. "పైసలు విడుదలైనప్పుడు అవి వెంటనే భూములు కోల్పోయిన రైతులకు చేరాలి.
ఒకవేళ ఏదైనా బలమైన కారణంతో వాటిని పంపిణీ చేయలేకపోతే.. ఆ కారణం ఏంటో స్పష్టంగా వివరించి, ఆ సొమ్మును ప్రభుత్వానికి తిరిగి పంపించండి. అంతేగానీ, ఖాతాల్లో పైసలు పెట్టుకోవడం సరికాదని" మంత్రి తేల్చిచెప్పారు. కలెక్టర్లు వెంటనే రంగంలోకి దిగి, రైతులతో చర్చలు జరిపి పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.
రైతులకు న్యాయమైన పరిహారం దక్కాలి..
రైతుల నుంచి భూములు తీసుకునేటప్పుడు ప్రభుత్వం మానవతా దృక్పథంతో.. సానుకూలంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. "రైతుల పొట్టకొట్టి ప్రాజెక్టులు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చట్టబద్ధంగా, ప్రస్తుత మార్కెట్ విలువకు వీలైనంత దగ్గరగా రైతులకు పరిహారం అందాలి" అని పేర్కొన్నారు.
అవార్డు పూర్తయిన తర్వాత పరిహారం చెల్లించడంలో ఆలస్యమైతే, నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన వడ్డీని కూడా రైతులకు చెల్లించాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఉంటే అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రాజెక్టుల కోసం రూ.6 వేల కోట్లు..
సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి 2026 సంవత్సరానికి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతుల కోసం రూ.6 వేల కోట్లు కేటాయించారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రాజెక్టులకు పైసల కొరత రాకూడదనే ఉద్దేశంతో సాధారణ ఇరిగేషన్ బడ్జెట్ కాకుండా ఈ నిధులను ప్రత్యేకంగా సమకూరుస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు. నల్గొండ, యాదాద్రి-భువనగిరి, నారాయణపేట, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల, హన్మకొండ తదితర జిల్లాల్లో భూసేకరణపై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. నల్గొండ జిల్లాలోని చింతపల్లి రిజర్వాయర్, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయసముద్రం, నెల్లికల్లు ప్రాజెక్టుల్లో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తయిన తర్వాత దాని ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే పెండ్లిపాకల రిజర్వాయర్ అత్యంత కీలకమని, అక్కడ భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
అవార్డు పాసయ్యాకే టోకెన్లు రైజ్ చేయాలి:
నిధుల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత ఉండాలని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. భూసేకరణ అవార్డులు పూర్తయి, రైతులకు డబ్బులు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే టోకెన్లు రైజ్ చేసి నిధులు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అలా కాకుండా ముందే నిధులు తెప్పించుకుని బ్యాంకు ఖాతాల్లో నిరర్థకంగా ఉంచడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
- సీఎస్ సంజయ్ జాజు
