జూరాలలో 9 టీఎంసీలున్నా నీళ్లిస్తలేరు..ప్రాజెక్టు కింద ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్

జూరాలలో 9 టీఎంసీలున్నా నీళ్లిస్తలేరు..ప్రాజెక్టు కింద ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్

హైదరాబాద్‌‌, వెలుగు: పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్‌‌ రెడ్డి.. అదే పాలమూరు రైతులకు మొదటి శత్రువుగా మారారని బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ అన్నారు. జూరాల రిజర్వాయర్‌‌లో పుష్కలంగా నీళ్లున్నా విడుదల చేయకుండా, రైతుల పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న దుస్థితికి ‘ఎల్‌‌ నినో’ కారణం కాదని, కాంగ్రెస్‌‌ తెచ్చిన ‘ఎల్‌‌ కాంగో’ తెగులే కారణమని విమర్శించారు. జూరాల ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరం పంట ఎండినా దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సోమవారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల నుంచి ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా నీళ్లు తరలించుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఈ ఏడాది కృష్ణా నదిలో 248 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తే, రాష్ట్రం కేవలం 28 టీఎంసీలు వినియోగించుకున్నట్టు తెలిపారు.

జూరాలలో ప్రస్తుతం 9 టీఎంసీల నీటి లభ్యత ఉందని, తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు పోగా.. మిగిలిన నీటిని ఆయకట్టుకు విడుదల చేయకుండా సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం, తెలంగాణ ప్రాజెక్టు వద్ద బారికేడ్లు పెట్టి వందలాది పోలీసులతో దిగ్బంధించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.