- ఒక్క ఏడాదిలోనే రూ.23.33 కోట్ల లాభాలు
- జాతీయ స్థాయిలో వ్యాపార విస్తరణ
- మూడేళ్లలో రూ.34.20 కోట్ల నికర లాభాలు
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్హెవీ మెషినరీ అండ్ఇంజినీరింగ్లిమిటెడ్(అప్మెల్) మూసివేసే దశ నుంచి లాభాల్లోకి అడుగుపెట్టింది. 2025–26లో ఒకే ఏడాది రికార్డు స్థాయిలో రూ.23.33 కోట్ల లాభాలు ఆర్జించింది. మూడేళ్లలోనే రూ.34.20 కోట్ల నికర లాభాలు దక్కించుకుంది. ఒకప్పుడు రూ.21 కోట్ల నష్టాలతో సతమతమైన సంస్థను సింగరేణి టేకోవర్చేసి, నెమ్మదిగా నికర లాభాల్లోకి తీసుకొచ్చింది. ఆంధ్రా నుంచే జాతీయస్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ మూడేళ్లుగా వరుస లాభాలు పొందుతోంది.
1976లో విజయవాడలో ఏర్పడిన సంస్థ
సింగరేణి సహా వివిధ పరిశ్రమలకు అవసరమైన యంత్రాలు, యంత్ర విడిభాగాలను తయారు చేసి సరఫరా చేయడంతోపాటు స్థానికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 1976లో విజయవాడకు సమీపంలోని కొండపల్లి వద్ద 209 ఎకరాల్లో ‘ఏపీఎచ్‌ఎంఈఎల్’ ఏర్పాటు చేశారు. ఇందులో మొదట అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు(ఏపీ ఐడీసీ) 62.35 శాతం వాటా ఉండగా పబ్లిక్ షేర్ హోల్డర్స్‌కు 35.08 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 2.56 శాతం వాటా ఉండేది. ప్రారంభ దశలో ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాకపోవడం, అవసరానికి మించి సిబ్బందిని నియమించుకోవడం వంటి కారణాలతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. ఒక దశలో ఉద్యోగుల సంఖ్య సుమారు 800కు చేరింది.
నష్టాలు పెరగడంతో 1992లో సంస్థను బీఐఎఫ్‌ఆర్‌కు నివేదించగా, 1993 నాటికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లింది. 1997-–98 నాటికి రూ.21 కోట్ల నష్టాలతో సతమతవుతోంది. పరిస్థితి మరింత దిగజారడంతో 2002 నవంబరు 28న సంస్థ మూసివేతకు సంబంధించి బీఐఎఫ్‌ఆర్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఊపిరి పోసిన సింగరేణి
ఏపీఎచ్‌ఎంఈఎల్ సంక్షోభ దశలో ఉమ్మడి ఏపీ పాలకులు.. దీని బాధ్యతలను సింగరేణికి అప్పగించారు. 1994 నుంచి సింగరేణికి అవసరమైన కొన్ని యంత్రాలు, విడిభాగాల కొనుగోలుకు ఏపీఎచ్‌ఎంఈఎల్‌కు సింగరేణి ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించింది. భూగర్భ గనుల్లో కార్మికుల రవాణాకు ఉపయోగించే మ్యాన్ రైడింగ్ సిస్టమ్స్, భారీ షావెల్స్‌కు అవసరమైన బకెట్లు, రూఫ్ బోల్టింగ్ రాడ్లు తదితర ఉత్పత్తులు సరఫరా చేసేది. ఈ ఆర్డర్ల ద్వారా సంస్థను పూర్తిస్థాయిలో గట్టెక్కించడం సాధ్యం కాకపోవడంతో ఏపీఎచ్‌ఎంఈఎల్‌లో సింగరేణితో పెట్టుబడులు పెట్టించారు.
అలా 1997–-98లో రూ.9.18 కోట్ల ఈక్విటీతో ఈ ప్రక్రియ ప్రారంభించి, రూ.14.08 కోట్ల పెట్టుబడితో 81.54 శాతం వాటాతో సింగరేణి ప్రధాన భాగస్వామిగా మారింది. ప్రస్తుతం పబ్లిక్ షేర్ హోల్డర్లకు 11.81 శాతం, ఏపీ ఐడీసీకి 5.79 శాతం వాటా, అప్పటి ప్రభుత్వానికి 0.86 శాతం వాటా ఉన్నాయి.
జాతీయ స్థాయిలో ఆర్డర్లు..
సింగరేణి చేతికి వచ్చాక అప్మెల్‌ను లాభాల బాట పట్టించేందుకు సంస్థ కీలక మార్పులు చేసింది. సింగరేణి నుంచి జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని ఏపీఎచ్‌ఎంఈఎల్ ఎండీగా నియమించడంతోపాటు పర్సనల్, ఇతర కీలక విభాగాల నిర్వహణకు అధికారులను నియమించింది. సింగరేణి నిర్వహణ పద్ధతులు, వ్యయ నియంత్రణ, ఉత్పాదకత పెంపు, కొత్త ఆర్డర్ల సాధన వంటి చర్యలతో అప్మెల్ ఆర్థికంగా బలోపేతమైంది. గతంలో ప్రధానంగా సింగరేణి వంటి సంస్థలకు యంత్రాలు, విడిభాగాలను సరఫరా చేసిన అప్మెల్ఇప్పుడు తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది.
బీహెచ్‌ఈఎల్, జెన్‌కో, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్ వంటి ప్రముఖ సంస్థలకు కూడా యంత్రాలు, విడిభాగాలను సరఫరా చేస్తూ జాతీయస్థాయిలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది. కొత్త సంస్థల నుంచి ఆర్డర్లు సాధించడం, ఉత్పత్తుల్లో వైవిధ్యం తీసుకురావడం, వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టడం సంస్థ ఆర్థిక పనితీరు మెరుగుపడటానికి దోహదపడ్డాయి.
మూడేళ్లుగా వరుస లాభాలు
ఏపీలోని అప్మెల్సంస్థ మూడేళ్లుగా స్థిరమైన లాభాలను ఆర్జిస్తుంది. ముఖ్యంగా తన 50 ఏళ్ల చరిత్రలో 2025-–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.23.33 కోట్ల నికర లాభాన్ని సాధించింది. 2023–-24లో రూ.1.05 కోట్లు, 2024-–25లో రూ.9.87 కోట్లు లాభాలు సాధించింది. 1998-–99లో సింగరేణి ఆధీనంలోకి వచ్చాక ఇప్పటి వరకు సంస్థ ఆర్జించిన మొత్తం లాభాలు రూ.60.85 కోట్లకు చేరినట్లుగా సింగరేణి ఆఫీసర్లు ప్రకటించారు.
అప్మెల్‌ను మరింత విస్తరిస్తాం
అప్మెల్సంస్థను మరింతగా విస్తరించి, జాతీయ స్థాయి భారీ ఇంజినీరింగ్ సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రోత్సాహంతో సింగరేణి ఎంప్లాయీస్అప్మెల్అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారానికోసారి సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు పోవడం వల్ల మూడేళ్లుగా నికర లాభాలను సంస్థ ఆర్జించింది. ఎంప్లాయిస్ కృషి ఫలితంగానే రికార్డు స్థాయిలో ఒకే ఏడాదిలో రూ.23 కోట్లకు పైగా లాభం వచ్చింది.
-జ్యోతి బుద్దా ప్రకాశ్, సింగరేణి సీఎండీ, హైదరాబాద్
