టెహ్రాన్: సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు చేస్తున్న వైమానిక దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ విషయంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ సౌదీ అరేబియాపై దాడులకు పాల్పడటంతో ఈ సంక్షోభం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నాయకులు వెంటనే ఒక ఒప్పందానికి రావాలని, లేకపోతే ఆర్థికంగా పతనమవడం లేదా వారి నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నిమిత్తం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ న్యూయార్క్ రానున్న నేపథ్యంలో, ఆయనతో సమావేశం కావడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, తమపై ఏ క్షణంలోనైనా కొత్త దాడి జరిగితే అమెరికా స్థావరాలు, ప్రయోజనాలే లక్ష్యంగా తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ హెచ్చరించింది. వాషింగ్టన్ మిత్రదేశాలను కూడా ఈ యుద్ధంలో భాగస్వాములుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.
రియాద్ ఎయిర్ పోర్ట్‌పై దాడి..
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ గ్రూప్ సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా విమానాశ్రయ ప్రాంతంలో భారీ ఎత్తున నల్లటి పొగలు ఎగసిపడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉందని, విమాన ప్రయాణాలు రద్దయ్యే లేదా గగనతలం మూసివేయబడే అవకాశం ఉన్నందున అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బాబ్ ఎల్ -మాండేబ్ జలసంధిలో ఆంక్షలు..
ఈ ఘర్షణల వల్ల ప్రపంచ ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించగా, తాజాగా బాబ్ ఎల్- మాండేబ్ జలసంధిపై హౌతీలు పట్టు సాధించి షిప్పింగ్ మార్గాలను నియంత్రిస్తున్నారు. దీనివల్ల గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లాల్సిన చమురు, ఇంధన ఎగుమతులు
దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి.
మరోవైపు అమెరికా విధిస్తున్న దిగ్బంధనాల కారణంగా ఇరాన్ తన సొంత చమురును విక్రయించలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నప్పటికీ, గతేడాది జూన్‌లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు.
జులైలో ఆ ఒప్పందం రద్దయిన తర్వాత, తామ డిమాండ్లు నెరవేరే వరకు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రువులను తిప్పికొట్టడానికి, దౌత్యపరమైన విజయాలను సాధించడానికి తాము పోరాటాన్ని, చర్చలను కొనసాగిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖాలిబాఫ్ తెలిపారు.
ఇరాన్ బృందానికి వీసాలు నిరాకరించిన అమెరికా
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి (యూఎన్‌జీఏ) హాజరవుతున్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రతినిధి బృందంలోని పలువురు సభ్యులకు వీసాలు ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. అధ్యక్షుడి కమ్యూనికేషన్స్ బృందంతో సహా కీలక సభ్యులకు అమెరికా వీసాలు నిరాకరించిందని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత శత్రుత్వపూరిత వైఖరితో తమ ఉన్నత స్థాయి బృందానికి వీసాలు ఇవ్వడంలేదని వ్యాఖ్యానించింది. అధ్యక్షుడు పెజెష్కియాన్ బుధవారం యూఎన్‌వో సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. గత ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత.. అమెరికాలో అడుగుపెట్టనున్న అత్యున్నత స్థాయి ఇరాన్ నాయకుడు పెజెష్కియానే కావడం గమనార్హం.
