నయీం ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయా? చేతులు మారాయా ?

నయీం ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయా? చేతులు మారాయా ?
  • 327 ఆస్తులు 22 ఏ(1),(ఈ)లో చేర్చాలని గతేడాది జీవో, ఆపై గెజిట్
  • కానీ, కొన్నింటినే అప్​లోడ్​ చేసిన రెవెన్యూ అధికారులు
  • 22 ఏ(1),(ఈ)లో కనిపించని తూప్రాన్​పేట ల్యాండ్ 
  • ఈడీ కేసులో ఉన్నందున రిజిస్ట్రేషన్కు సబ్​ రిజిస్ట్రార్ నిరాకరణ
  • సీసీఎల్ఏకు చేరిన వివాదం
  • ఆదివారం పొద్దున 7.45కు 5.5 ఎకరాల డిటైల్స్ అప్​లోడ్, కనిపించని 40 ఎకరాల సర్వే నంబర్

యాదాద్రి, వెలుగు: ఎన్​కౌంటర్లో మరణించిన గ్యాంగ్​స్టర్​ నయీం ఆస్తులపై చాన్నాళ్ల తర్వాత చర్చ మొదలైంది. యాదాద్రి జిల్లా తూప్రాన్​పేట భూ రిజిస్ట్రేషన్​ వివాదంతో ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో చేర్చిన నయీం ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయా? చేతులు మారాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గ్యాంగ్​స్టర్​ నయీం బెదిరింపులు, అరాచకాలతో అత్యంత విలువైన భూములను కూడబెట్టుకున్నాడు.

యాదాద్రితో సహా పలు జిల్లాల్లో ఉన్న ఈ భూములను తన భార్య, బంధువులు, అనుచరుల పేర్లతో రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాడు. 8 ఆగస్టు 2020న జరిగిన ఎన్​కౌంటర్​లో నయీం మరణించాడు. ఆ తర్వాత నయీం కూడబెట్టిన ఆస్తులపై సిట్, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ), ఇతర దర్యాప్తు సంస్థల కేసుల కారణంగా ప్రొహిబిటెడ్​లో చేరాయి.

327 ఆస్తులపై జీవో
నయీం తమ ఆస్తులను బెదిరించి లాక్కున్నాడని అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం నయీంకు చెందిన 327 ఆస్తులను 22ఏ(1),(ఇ)లో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. నయీంకు సంబంధించి యాదాద్రి జిల్లాలో 200కు పైగా ఆస్తులు ఉండగా, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లో వంద వరకూ ఆస్తులు ఉన్నాయి.

మిగిలినవి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, జగిత్యాల, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, మహబూబ్​నగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్నాయి. ఈ వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపి వాటిని రిజిస్ట్రేషన్​ చేయకుండా నిషేధిస్తూ జీవో నంబర్​ 206 విడుదల చేసిన ప్రభుత్వం ఆతర్వాత 149 నంబర్​ గెజిట్​ విడుదల చేసింది.

గెజిట్​ జారీ చేసినా..
ప్రభుత్వం జారీ చేసిన గెజిట్​లో పేర్కొన్న ఆస్తుల వివరాలను రిజిస్ట్రేషన్​ అండ్​ స్టాంప్​ డిపార్ట్​మెంట్​ వెబ్​సైట్​లోని ప్రొహిబిటెడ్​ కాలంలో అగ్రికల్చర్, నాన్​ అగ్రికల్చర్​ కాలాల్లో పేర్కొనాల్సి ఉంటుంది. 

ఈ మేరకు యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఆస్తుల వివరాలను 22 ఏ(1), (ఇ)లో అప్​లోడ్​ చేశారు. కానీ, చౌటుప్పల్​ మండలం తూప్రాన్​పేటలో ఉన్న పలు ఆస్తుల వివరాలను చేర్చలేదు. దీంతో ఈ ఆస్తులపై కన్నేసిన కొందరు వ్యక్తులు ఆ భూమిని రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి ప్రయత్నించారు.

సర్వే నంబర్​ 13 ఏ, సర్వే నంబర్​ 14లోని 5.5 ఎకరాల భూమిలోని ఖాళీ ప్లాట్లను రిజిస్ట్రేషన్​ చేయాలంటూ శుక్రవారం చౌటుప్పల్  రిజిస్ట్రేషన్​ ఆఫీసుకు వెళ్లారు. అయితే ఈ భూమి ఫిజికల్​గా ఖాళీ ప్లాట్లుగా ఉండగా రికార్డుల్లో మాత్రం అగ్రికల్చర్​ ల్యాండ్​గానే ఉంది.

ఈడీ కేసుల కారణంగా రిజిస్ట్రేషన్  చేయలేమని రిజిస్ట్రార్​ చెప్పినా. వారు వినకుండా వాదనకు దిగారు. తహసీల్దార్​ ఆఫీస్​లో తాము కనుక్కున్నామని, రికార్డుల్లోనూ ఈ భూములు నిషేధిత జాబితాలో లేవని వాదించడంతో సబ్​ రిజిస్ట్రార్​ ఈ విషయాన్ని సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై వివరణ కోరుతూ సీసీఎల్ఏ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. 

ఆదివారం పొద్దుగాల 7.45కు అప్​లోడ్​
 గెజిట్​లో పేర్కొన్న ఆస్తులను ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఎందుకు పెట్టలేదని చౌటుప్పల్​తహసీల్దార్​ వీరాబాయికి శుక్రవారం రాత్రి అధికారులు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. ఈ అంశం వివాదం కావడంతో యాదాద్రి జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు శనివారం రాత్రంతా కష్టపడి రెండు సర్వే నంబర్లలోని 5.5 ఎకరాలను ఆదివారం పొద్దుగాల 7.45 గంటలకు ప్రొహిబిటెడ్​ సైట్​లో అప్​లోడ్​ చేశారు. కానీ, మరో సర్వే నంబర్​లో ఉన్న దాదాపు 40 ఎకరాలు ఇప్పటికీ అప్​లోడ్​ చేయలేదని తెలుస్తోంది.

ఈ భూమికి సంబంధించి సిట్​ నుంచి ఎన్​వోసీ వచ్చిందని కొందరు ఆఫీసర్లు అంటున్నారు. నిజంగానే దర్యాప్తు సంస్థల క్లియరెన్స్​ తర్వాతే చేతులు మారిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. 40 ఎకరాలు ప్రొహిబిటెడ్​ సైట్​లో కోర్టు కేసుల కాలమ్​లో కనిస్తున్నాయి.

చౌటుప్పల్​ మండలం తూప్రాన్​పేటలోని భూమి అధికారుల నిర్లక్ష్యం వల్ల 22( ఏ) లిస్ట్​లో చేరలేదా? కావాలనే ఎవరైనా లిస్ట్​లో చేర్చకుండా అడ్డు పడ్డారా? అన్న చర్చ సాగుతోంది. మిగిలిన 9 జిల్లాల్లోని నయీం ఆస్తులపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.