బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌‌‌‌‌లో హమాలీల ధర్నా ..భారీగా ట్రాఫిక్జామ్‌‌‌‌‌‌‌‌

బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌‌‌‌‌లో హమాలీల ధర్నా ..భారీగా ట్రాఫిక్జామ్‌‌‌‌‌‌‌‌

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో హమాలీలు సోమవారం మెరుపు ధర్నాకు దిగారు. మార్కెట్ ప్రాంగణంలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌ ప్రధాన ద్వారాల వద్ద వాహనాల రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. 

దీంతో కూరగాయలు, సరుకులతో వచ్చిన లారీలు, ఇతర వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో తాగునీరు, టాయిలెట్స్‌‌‌‌‌‌‌‌, విశ్రాంతి గదుల వంటి ప్రాథమిక సౌకర్యాలు లేక ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తున్నామని హమాలీ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడిన కార్మికులు, మూడు రోజుల్లోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే వ్యవసాయ శాఖ మంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.