జూరాల ప్రాజెక్ట్పై నీళ్ల లొల్లి..ప్రాజెక్టులో మిగిలింది 5 టీఎంసీల నీళ్లు

జూరాల ప్రాజెక్ట్పై నీళ్ల లొల్లి..ప్రాజెక్టులో మిగిలింది 5 టీఎంసీల నీళ్లు
  • డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ పోతే మిగిలేది 2 టీఎంసీలే
  • తాగునీటికే చాలవంటున్న అధికారులు
  • సాగుకు ఇవ్వాల్సిందేనన్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ 
  • రైతులతో కలిసి నీటి విడుదల కోసం ధర్నాలు
  • రెచ్చగొడుతున్నారంటున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు
  • వరి సాగు వద్దని ముందే చెప్పిన సర్కారు
  • అయినా జూరాల కింద 1.20 లక్షల ఎకరాల్లో సాగు
  • నీరందక ఎండుతున్న పంటలు.. రైతుల్లో ఆందోళన

మహబూబ్​నగర్/గద్వాల, వెలుగు:   ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన జూరాల ప్రాజెక్టు చుట్టూ జల రాజకీయం నడుస్తున్నది. ప్రాజెక్టులో 5 టీఎంసీల నీళ్లే ఉన్నా.. 9 టీఎంసీలు ఉన్నాయంటూ రైతులను ప్రతిపక్ష నేతలు రెచ్చగొట్టడంతో ఆందోళన నెలకొన్నది.  జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు 5 టీఎంసీల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో  కెనాల్స్​, లిఫ్టుల ద్వారా సాగునీటి విడుదలను ఆఫీసర్లు బంద్​పెట్టారు. ఇందులో 3  టీఎంసీలు డెడ్​ స్టోరేజీ పోగా మిగిలేది 2టీఎంసీలేనని, వీటిని వచ్చే జూన్​దాకా తాగునీటికి వాడాల్సి ఉంటుందని, అందుకే ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిలిపేశామని స్పష్టత ఇచ్చారు.

జూరాల కింద సాగుచేసిన పంటలను కాపాడుకోవాలంటే 15 టీఎంసీలు అవసరమని, ఇప్పుడున్న స్థితిలో ఇది అసాధ్యమని అధికారులు చెప్తున్నారు . కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ సాగుకు జూరాల నీళ్లు విడుదల చేయాల్సిందేనని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ నేతలు పట్టుపడ్తున్నారు. రైతులతో కలిసి ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి జూరాల ముట్టడికి పిలుపునివ్వగా, ఇద్దరినీ పోలీసులు హౌస్​ అరెస్ట్​  చేశారు. అటు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామంచందర్​రావు ‘చలో జూరాల’కు పిలుపునివ్వడంతో స్టేట్​పాలిటిక్స్​ ఒక్కసారిగా  హీటెక్కాయి. మరోవైపు ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, కావాలనే రైతులను రెచ్చగొడ్తున్నాయని అధికారపార్టీ నేతలు మండిపడ్తున్నారు. 

ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్​ నుంచి నీటిని విడుదల చేసేలా కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, ఆ నీళ్లు వస్తే సాగునీటికి ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌‌లో ప్రకటించారు. ఈసారి ఎల్‌‌నినో పరిస్థితుల నేపథ్యంలో జూరాల ఆయకట్టు కింద వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచించింది. అధికారుల ద్వారా అవగాహన కల్పించింది.  కానీ రైతులు ఎప్పట్లాగే వరి సాగుచేయడంతో ఇప్పుడు నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులకు మద్దతుగా ప్రతిపక్షాలు తరలివస్తుండడంతో ఈ పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది.

వాస్తవాలకు భిన్నంగా ప్రతిపక్షాల ప్రకటనలు 

జూరాలలో ఉన్న నీటి నిల్వలపై అధికారుల నివేదికలు ఒకలా ఉంటే.. ప్రతిపక్షాల ప్రకటనలు మరోలా ఉండడంతో రైతుల్లో అయోమయం నెలకొన్నది. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీళ్లున్నాయని, సాగుకు సరిపడా ఉన్నప్పటికీ రాష్ట్ర​ప్రభుత్వం రైతులను కావాలనే ఇబ్బంది పెడుతోందని బీఆర్‌‌‌‌ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​ఆరోపించారు. కానీ సోమవారం కృష్ణా బేసిన్​పరిధిలోని ప్రాజెక్టుల వివరాలను పరిశీలిస్తే ప్రస్తుతం జూరాలలో ఉన్నది 5.1 టీఎంసీలేనని స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టు ఫుల్​ కెపాసిటీ 17.54 టీఎంసీలు కాగా, ఏండ్లుగా పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం ఫుల్‌‌ కెపాసిటీ 8.9‌‌ ‌‌టీఎంసీలకు చేరింది.

అంటే జూరాల పూర్తిస్థాయిలో నిండితే కూడా కేటీఆర్​ చెప్పిన 9 టీఎంసీలు నిల్వ ఉండే ప్రసక్తి లేదు. దీంతో రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్, హరీశ్‌‌రావు ఇలా అబద్ధాలు ఆడుతున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఈ ప్రాజెక్టు గత రికార్డుల ప్రకారం యేటా మే చివరి వారం నుంచే వరదలు మొదలయ్యేవి. కానీ ఎల్‌‌నినో ప్రభావం వల్ల ఈసారి 2  నెలలు ఆలస్యంగా జులై 27 నుంచి జూరాలకు వరద మొదలైంది. ఆగస్టు 16 నాటికి కేవలం 20 రోజులు మాత్రమే ఎగువ నుంచి వరద వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎలాంటి ఫ్లడ్‌‌ రాలేదు. ప్రాజెక్టుకు వరద  ప్రారంభమైన నాటి నుంచే జూరాల పరిధిలోని నెట్టెంపాడు, భీమా-1, భీమా-2 లిఫ్టులతోపాటు కోయిల్‌‌సాగర్‌‌‌‌కు ఆఫీసర్లు నీటిని ఎత్తిపోశారు.

జూరాల కాల్వలకు ఈ నెల 14 వరకు నిరంతరాయంగా నీటిని విడుదల చేశారు. వరదలు వస్తే సాగునీటి విడుదల కొనసాగించాలని భావించారు. కానీ 45 రోజులైనా మళ్లీ వరదలు రాకపోవడం, ప్రాజెక్టులో నీటి నిల్వలు 5.01 టీఎంసీలకు చేరడంతో ఆఫీసర్లు సాగునీటి విడుదలను బంద్​పెట్టారు.  ప్రస్తుతం ఉన్న 5 టీఎంసీల్లో 3.02 డెడ్​స్టోరేజీ పోగా, మిగిలిన 2 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం  నిల్వ ఉంచాల్సి ఉంటుందని, ప్రొటోకాల్‌‌నే తాము పాటిస్తున్నామని ఆఫీసర్లు చెప్తున్నారు.  పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌ఎస్​ నాయకులకు ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కావాలనే రైతులను రెచ్చగొడ్తున్నారని అధికారపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

పంటలను కాపాడుకోవాలంటే 15 టీఎంసీలు కావాలె..

జూరాలలో ప్రస్తుతం5.1 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, ఆఫీసర్ల లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద 1.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 82 వేల ఎకరాల్లో వరి  సాగైంది. ఇక  భీమా కింద 2.5లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద లక్ష ఎకరాలు, కోయిల్​ సాగర్ కింద 30 వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. ప్రస్తుతం అన్ని చోట్లా వరి పొట్ట దశలో ఉంది. మూడు నుంచి నాలుగు తడుల నీళ్లు అందితే తప్ప పంట చేతికి రాదు. ఇరిగేషన్​ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఈ పంటలను కాపాడుకోవడానికి ఎంతలేదన్నా  మరో 15 టీఎంసీల నీరు అవసరం. ఎగువ నుంచి వరదలు వస్తే తప్ప ఇప్పుడున్న నీటితో ఇది సాధ్యం కాదని వారు స్పష్టంచేస్తున్నారు. 

తాగునీటికి 2 టీఎంసీలు అవసరం

జూరాల ఆధారంగా గద్వాల, అలంపూర్, మక్తల్, నారాయణపేట సెగ్మెంట్లకు తాగునీరు అందుతుంది. ఈ 4 నియోజకవర్గాల్లో 11 లక్షల జనాభా ఉండగా, వీరికి  ఏడాదికి 2 టీఎంసీలకు పైగానే తాగునీరు అవసరం. ప్రస్తుతం జూరాలలో ఉన్న నీటి నిల్వలు ఈ 4 నియోజరకవర్గాల ప్రజల దాహం తీర్చేందుకు మాత్రమే సరిపోతాయని అధికారులు అంటున్నారు. పై నుంచి వరదలు రాకుండా ఈ నీటిని సాగుకు విడుదల చేస్తే తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు. 

నీరందక ఎండుతున్న పంటలు

ఈ ఏడాది ఎల్‌‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం మే నెల మొదటి వారం నుంచే రైతులను అప్రమత్తం చేసింది. వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని  ప్రచారం చేసింది. అగ్రికల్చర్​, హార్టికల్చర్​ ఆఫీసర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో తిరిగి ఎల్‌‌నినో వల్ల ఎదురయ్యే పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన కల్పించారు.

జూన్​ 23 నుంచి 30 వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించి.. ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించారు. కానీ, రైతులు మాత్రం వర్షాల మీద ఉన్న నమ్మకం తో మళ్లీ వరి సాగుకే మొగ్గు చూపారు. ఉమ్మ డి మహబూబ్​నగర్​ జిల్లావ్యాప్తంగా జూన్​, జులై, ఆగస్టులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం ఈ పంటలన్నీ పొట్ట దశలో ఉన్నాయి. గత ఆగస్టు రెండోవారంలో కురిసిన వర్షాలు మళ్లీ జాడ లేకపోవడంతో వారం నుంచి చేన్లు ఎండిపోయి నెర్రలు బారుతున్నాయి.

9 టీఎంసీల నీళ్లున్నయ్​: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఈ ఏడాది కృష్ణా నదిలో 248 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తే, రాష్ట్రం కేవలం 28 టీఎంసీలు వినియోగించుకున్నది. జూరాలలో ప్రస్తుతం 9 టీఎంసీల నీటి లభ్యత ఉంది. తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు పోగా.. మిగిలిన నీటిని ఆయకట్టుకు విడుదల చేయాలి. పంటలను కాపాడుకునేందుకు రైతులు గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే వారిపై కేసులు పెడుతున్నారు. అరెస్టులు, బైండోవర్లతో అన్నదాతల గొంతును నొక్కలేరు. 

గేట్లు తెరవాల్సిందే: రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

రైతుల పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు.  స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు, ప్రభుత్వ సమన్వయ లోపం కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. వెంటనే జూరాల గేట్లు తెరిచి సాగునీరు విడుదల చేయాలి. ప్రాజెక్టులోని నీటిమట్టాన్ని పరిశీలించి, రైతుల గోడును క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగళవారం జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను సందర్శిస్తుంది. 

జూరాలకు కాదు.. మోదీ వద్దకు వెళ్లండి: జూపల్లి 

తెలంగాణ బీజేపీ నాయకులు పోవాల్సింది జూరాల ప్రాజెక్టు వద్దకు కాదు.. ప్రధాని మోదీ వద్దకు వెళ్లాలి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేలా ప్రయత్నించాలి. ఎల్‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన రూ.20 వేల కోట్ల కరువు నిధులను తెప్పించాలి. -జూరాలలో ఉన్న కొద్దిపాటి నీటిని సాగు కోసం వదిలేస్తే.. భవిష్యత్తులో తాగునీటి అవసరాలు ఎలా తీరుతాయి?