జూరాలకు కాదు.. మోదీ వద్దకు వెళ్లండి..బీజేపీ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన

జూరాలకు కాదు.. మోదీ వద్దకు వెళ్లండి..బీజేపీ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన

హైదరాబాద్‌‌, వెలుగు: బీజేపీ నాయకులు పోవాల్సిం ది జూరాల ప్రాజెక్టు వద్దకు కాదని.. ప్రధాని మోదీ వద్ద కు వెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.  జూరాలలో ఉన్న కొద్దిపాటి నీటిని సాగు కోసం వదిలేస్తే.. భవిష్యత్తులో తాగునీటి అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. సోమవారం సీఎల్పీలో  మీడియాతో మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేలా ఇక్కడి బీజేపీ నాయకులు ప్రయత్నించాలని, ఎల్‌‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన రూ.20 వేల కోట్ల కరువు నిధులను తెప్పించాలని సవాల్‌‌ విసిరారు. 

 పదేండ్లలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే?

ఎల్‌‌నినో కారణంగా వర్షాలు, రిజర్వాయర్లలో నీళ్లు లేక తాగునీటి గండం పొంచి ఉందని.. కానీ, బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొడుతున్నారని జూపల్లి విమర్శిం చారు. వాస్తవాలను మరిచిన శవాలపై పేలాలు ఏరుకున్నట్టుగా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.  మన రాష్ట్ర వాటా నీళ్లు ఏపీకి మళ్లడానికి కారణం కేసీఆరే అని, రోజా రొయ్యల పులు సు కోసం కృష్ణా నీటిని ఆంధ్రకు అప్పగించారని ఆరోపించారు.

‘నీళ్లను ఒడిసి పట్టాలని తరుచూ చెప్పే కేసీఆర్‌‌.. మరి జూరాల నీటిని ఎందుకు ఒడిసి పట్టుకో లేదో చెప్పాలి.. పాలమూరుపై కేసీఆర్‌‌కు అంత ప్రేమ ఉంటే పదేండ్ల బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో ఇక్కడి ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలి?’’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లను ఎర్రవల్లికి తీసుకువచ్చిన కేసీఆర్‌‌.. గట్టు రిజర్వాయర్‌‌ను ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్‌‌.. పాలమూరు జిల్లాను ఎందుకు ఎండబెట్టారని ప్రశ్నించారు.

43 శాతం కృష్ణా నీటిని వాడుకుంటున్నం

ఎల్‌‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు మొదటి నుంచీ సూచించామని జూపల్లి  తెలిపారు. కర్నాటక సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని, వర్షాకాలం ఇంకా ఉందని చెప్పారు. ఆల్మట్టి, నారాయణపూర్‌‌ ప్రాజెక్టుల నుంచి ఇంకా నీళ్లు వస్తాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. నీళ్లు పుష్కలంగా ఉన్న సమయంలో కూడా అప్పటి కేసీఆర్‌‌ ప్రభుత్వం కృష్ణా నీటిలో 30 శాతానికి మించి వాటాను వాడుకోలేదని, కానీ  తమ ప్రభుత్వం 43 శాతం కృష్ణా నీటిని వాడుకుంటున్నదని మంత్రి  వివరించారు.