- జూరాల ఆయకట్టుకు నీళ్లియ్యకుండా రైతులపై దౌర్జన్యాలేంది? : హరీశ్ రావు
- శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్లు నీళ్లు పోతుంటే.. రేవంత్ సర్కార్ చోద్యం చూస్తోందా?
- జూరాలలో 8.4 టీఎంసీలున్నా ఎందుకు ఇయ్యరు?
- నీళ్లడిగితే అన్నదాతల చేతులకు సంకెళ్లు వేస్తరా? అని నిలదీత
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 738 కిలోమీటర్ల దూరంలో పెన్నా బేసిన్‌లో ఉన్న ఆంధ్రాలోని కుప్పం వరకు కృష్ణా జలాలు తరలిపోతుంటే.. పక్కనే ఉన్న పాలమూరుకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిలదీశారు. పక్క రాష్ట్రానికి కళ్లముందే నీళ్లు పోతుంటే తెలంగాణ పాలకులు చోద్యం చూస్తున్నారని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ చేతకానితనం, పాలనా వైఫల్యమేనని మండిపడ్డారు.
జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీరు ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను, వారికి మద్దతుగా నిలిచిన ఉమ్మడి పాలమూరు బీఆర్‌ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడమేంటని సోమవారం 'ఎక్స్' వేదికగా ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు ప్రాజెక్టులో భాగంగా మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో భారీ జలాశయాలను నిర్మించామని గుర్తుచేశారు. ఆ రిజర్వాయర్లను నీళ్లతో నింపే తెలివి, సోయి కూడా కాంగ్రెస్ పాలకులకు లేదా? అని ప్రశ్నించారు. దీనికి సీఎం లేదా నీటిపారుదల శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సొంత జిల్లాకు నమ్మక ద్రోహం
పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. తన సొంత జిల్లా రైతులకు చేస్తున్నది ముమ్మాటికీ నమ్మక ద్రోహమేనని హరీశ్‌రావు విమర్శించారు. నీళ్లు అడిగిన రైతులను కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారని, అన్నదాతల చేతులకు సంకెళ్లు వేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. కృష్ణానదిలో వరద ప్రవాహాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యంతో నీటిని లిఫ్ట్ చేయకుండా వదిలేసి తెలంగాణకు జల ద్రోహం చేసిందే కాంగ్రెస్ సర్కార్ అని, పాలకులు చేసిన తప్పుకు అమాయక రైతులు శిక్ష అనుభవించాలా? అని ప్రశ్నించారు.
8.4 టీఎంసీలున్నా ఎందుకు ఇవ్వరు..?
పంటలకు నీళ్లివ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఎల్ నినో అంటూ కుంటిసాకులు వెతుకుతోందని హరీశ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 8.4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ, నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదని నిలదీశారు.
