- బీసీలకు 42 శాతం రాజకీయ అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలి
- కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సభలో బీసీ సంఘాల డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న పురస్కారం ప్రకటించేలా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీలకు 42 శాతం రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరాయి. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ ఆధ్వర్యంలో సోమవారం ట్యాంక్ బండ్ జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సభ నిర్వహించారు.
మంత్రి సీతక్క, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్లు బీఎస్ రాములు, వకుళాభరణం కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జలదృశ్యం ఒక చైతన్య కేంద్రం: మంత్రి సీతక్క
తెలంగాణ ఉద్యమ చరిత్రలో జలదృశ్యం (బాపూజీ నివాసం) ఒక చైతన్య కేంద్రంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు. బాపూజీ ఆశయాలను తమ ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని, కులగణన ద్వారా సామాజిక న్యాయ సాధనకు ఒక చారిత్రక అడుగు పడిందని తెలిపారు. బాపూజీ ఆశయాల అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు.
బాపూజీ ఒక వర్గానికే పరిమితమైన నేత కాదు: దత్తాత్రేయ
బాపూజీ ఒక వర్గానికి లేదా రాజకీయ పార్టీకి పరిమితమైన నాయకుడు కాదని, సమాజమంతటికీ చెందిన మహనీయుడని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, అవకాశాల సముచిత పంపిణీ ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుందని బాపూజీ విశ్వసించారని గుర్తుచేశారు. కులగణన ద్వారా వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చి సామాజిక న్యాయానికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న పురస్కారం దక్కేలా తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.
రాష్ట్ర ఆకాంక్షను గొప్పగా భావించిన త్యాగధనుడు: శ్రీనివాస్ గౌడ్
పదవులు, అధికారాల కంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను గొప్పగా భావించిన త్యాగధనుడు బాపూజీ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే ప్రాధాన్యతనిచ్చిన మహోన్నత వ్యక్తిగా చరిత్రలో బాపూజీ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలను భావితరాలకు చేరవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం శాసనమండలి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎల్ రమణ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం రాజకీయ భాగస్వామ్యం, సమాన అవకాశాలు ఆత్మగౌరవంతో కూడిన సామాజిక తెలంగాణ నిర్మాణంతోనే బాపూజీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
సామాజిక తెలంగాణ సాధనకు జలదృశ్యం కేంద్ర బిందువుగా నిలవాలి: దాసు సురేశ్
జలదృశ్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ స్థాపన కోసం ఏడు సంవత్సరాలపాటు నిరంతర పోరాటం చేసి, అనేక మంది సామాజికవేత్తలు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ చారిత్రక లక్ష్యాన్ని సాధించగలిగామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి జలదృశ్యం ఎంతటి ప్రేరణా కేంద్రంగా నిలిచిందో, భవిష్యత్తులో సామాజిక తెలంగాణ సాధనకు కూడా అదే కేంద్ర బిందువుగా నిలవాలని ఆకాంక్షించారు.
