- వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల జాప్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
- కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయండి
- త్వరలో ఓపీ సేవలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: వరంగల్సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకం కలగకుండా గ్రీన్ చానల్ ద్వారా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ఎందుకు మందకోడిగా సాగుతున్నాయని అధికారులను నిలదీశారు.
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించిన సీఎం, యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. పనులు స్పీడప్ చేసేందుకు రానున్న 30 రోజుల పాటు రోజుకు 24 గంటలూ మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ఇంజనీరింగ్ అధికారులు సమగ్రమైన ‘వర్క్ షెడ్యూల్’ రూపొందించుకుని, ప్రతి రోజు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సెక్రటేరియెట్‌లో కూర్చుని సమీక్షలు చేయడం కాకుండా, సీఎంవో ఉన్నతాధికారులు స్వయంగా తరచూ గ్రౌండ్‌కు వెళ్లి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని ప్రతి ఒక్క విభాగానికి, నిర్మాణ విధులకు సంబంధించి ఒక్కో ప్రత్యేక అధికారికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించి పర్యవేక్షించాలన్నారు. ఇకపై వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజూ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి నివేదికలను పంపాలని స్పష్టం చేశారు.
సంబంధిత శాఖలతో ఒక ‘కో-ఆర్డినేషన్ కమిటీ’ని వెంటనే ఏర్పాటు చేసి, తలెత్తే అడ్డంకులను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్ తరహాలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఓపీ సేవలు ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఇదే సమయంలో సనత్‌నగర్ టిమ్స్‌లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కోసం స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పరిపాలన, పారిశుద్ధ్యం, ఇతర మెయింటెనెన్స్ బాధ్యతలను కార్పొరేట్ స్థాయిలో నడిపించేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీకి అప్పగించాలని సీఎం నిర్ణయించారు. దీనికి సంబంధించి తగిన విధివిధానాలు రూపొందించాలని సూచించారు.
