England vs India 4th T20: టీ20ల్లో ఏకాఛత్రాధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఒక్కసారిగా చతికిలపడింది. 2026 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇండియా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇలాంటి పేలవమైన పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. చిన్న జట్టు అయిన ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన శ్రేయస్ సేన, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లోనూ తీవ్ర నిరాశాజనక ప్రదర్శన చేస్తోంది. దీంతో ఇప్పుడు భారత్ వరుసగా రెండో సిరీస్‌ను కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. దీంతో రాబోయే రెండు మ్యాచులని తప్పకుండా శ్రేయస్ సేన తప్పకుండా గెలవాల్సిందే.
ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు:
రేపు (జులై 9, 2026 గురువారం) బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరు కోసం భారత తుది జట్టు (Playing XI) లో మేనేజ్‌మెంట్ మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన ఇన్నింగ్స్‌లలో 13, 24*, 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన తిలక్ వర్మపై వేటు వేసే యోచనలో సెలెక్టర్లు ఉన్నారు. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుని, వన్‌డౌన్ లో ఆడించే ఛాన్స్ ఉంది.
సంజూ శాంసన్ రీ ఎంట్రీపై ఫ్యాన్స్ డిమాండ్:
సంజూ శాంసన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌లకు దూరం పెట్టడంపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మూడో టీ20లో ఘోర ఓటమి తర్వాత ఇండియన్ ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ స్టేడియం నుంచి బస్సు వైపు వెళ్తుండగా.. అక్కడున్న కొందరు మాకు సంజూని ఆడించాలని నినాదాలు చేశారు. ఒకవేళ నాలుగో టీ20లోనూ సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వకపోతే టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్‌పై విమర్శలు మరింత తీవ్రమవడం ఖాయంగా కనోస్తుంది.
వైభవ్ సూర్యవంశీ వైఫల్యం.. అభిషేక్పైనే ఆశలు:
రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ, అతడి బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో మెరుపులు రాలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కలిపి అతడు కేవలం 27 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయినప్పటికీ ఓపెనర్‌గా వచ్చిన వైభవ్‌కు నాలుగో టీ20లో మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు, తొలి రెండు మ్యాచ్‌ల్లో 59, 43 రన్స్ తో రాణించిన ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ (Big Knock) రావాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది.
వరుణ్ చక్రవర్తి నిరాశ.. బౌలింగ్ విభాగంలో ఆందోళన:
కేవలం బ్యాటింగ్ వైఫల్యాలే కాదు, బౌలింగ్ విభాగంలోనూ ఇండియా చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. అతడు ఇప్పటి వరకు 7 ఓవర్లు వేసి ఒక్క వికెట్ పడగొట్టాడు. మరోవైపు, మూడో టీ20లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 4 ఓవర్లలో ఒక వికెట్ తీసుకుని 49 రన్స్ సమర్పించుకున్నాడు. వీరితో పాటు ప్రధాన పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా డెత్ ఓవర్లలో దారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
బ్రిస్టల్ గ్రౌండ్‌లో భారత్‌కు మంచి రికార్డు:
నాలుగో మ్యాచ్ జరగనున్న బ్రిస్టల్ మైదానంలో భారత జట్టుకు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్‌లో ఇండియా ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడింది. 2018లో జరిగిన ఆ హోరాహోరీ పోరులో 199 రన్స్ భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకా 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. టీమిండియా అదే తరహా జోరును ప్రదర్శించి ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.. లేకపోతే సిరీస్ ఇంగ్లాండ్ వశం అవుతుంది.
