రైతుల చూపు.. ‘అల్లం’ సాగు వైపు.. రూ.2 వేల నుంచి రూ.4 వేల 500కు చేరిన క్వింటాల్ ధర !

రైతుల చూపు.. ‘అల్లం’ సాగు వైపు.. రూ.2 వేల నుంచి రూ.4 వేల 500కు చేరిన క్వింటాల్ ధర !
  • సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో మళ్లీ చిగురిస్తున్న రైతుల ఆశలు
  • రూ.2 వేల నుంచి రూ.4,500కు చేరిన క్వింటాల్ ధర
  • ఈ ఏడాది 3 వేల ఎకరాల్లో సాగుకు సన్నద్ధం
  • కేరళ నుంచి భారీగా దిగుమతి అవుతున్న నాణ్యమైన విత్తనాలు

సంగారెడ్డి, వెలుగు: మార్కెట్లో అల్లం ధర పెరగడంతో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. గత రెండేండ్లుగా అల్లం పంట వేయడానికి ముందుకు రాని రైతులు ఇప్పుడు ఆ పంట విస్తీర్ణాన్ని పెంచి లాభాలు గడించేందుకు ఆశతో ఎదురుచూస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం అల్లం పంట సాగుకు ప్రత్యేక గుర్తింపు పొందింది. కోహిర్ అల్లం దిగుబడిలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కొంతకాలంగా మార్కెట్​లో అల్లానికి గిట్టుబాటు ధర లేక డిమాండ్ తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దాంతో రెండేండ్లుగా ఈ ప్రాంతంలో అల్లం పంట తగ్గింది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

అల్లం మద్దతు ధర ఒక్కసారిగా పెరగడంతో ఈసారి సాగుపై రైతులు దృష్టి పెట్టి సుమారు 3 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ధర లేక డిమాండ్ లేని టైంలో 800 ఎకరాల్లో పంట పండించగా, అప్పట్లో క్వింటాల్ అల్లం ధర రూ.2 వేలు పలికింది. ప్రస్తుతం మార్కెట్​లో అల్లం క్వింటాల్ ధర  రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు పలుకుతోంది. పెరిగిన ధర పర్మినెంట్ గా ఉంటుందనే నమ్మకంతో రైతులు పంట సాగు విస్తీర్ణాన్ని పెంచారు. గడిచిన తొమ్మిది నెలలుగా అల్లం ధర పెరిగి స్థిరంగా ఉండటం వల్ల అల్లం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేరళ నుంచి విత్తనాలు
అల్లం పంట సాధారణంగా మే నుంచి జూన్ నెలాఖరు వరకు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం పంటల సాగు కోసం భూములను చదును చేసి సేంద్రియ ఎరువులను చల్లి దిగుబడికి సిద్ధం చేసుకుంటున్నారు. కేరళ విత్తనాలను నాణ్యతకు చిహ్నంగా భావించి అక్కడి నుంచి అల్లం విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ నిల్వలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 500 క్వింటాళ్ల విత్తనాలను జహీరాబాద్ ప్రాంతానికి దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. కొందరు రైతులు మాత్రం స్థానికంగా సాగులో ఉన్న పంటలోని కేరళ రకం విత్తనాన్ని సేకరించి విత్తనాలుగా ఉపయోగించుకుంటున్నారు.

కాగా, అల్లం పంట  సాగు చేస్తే రెండేండ్ల వరకు అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. మార్కెట్​లో ధర లేనప్పుడు నీటి తడులు ఇవ్వడం ద్వారా పంట భూమిలోనే నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. నిల్వ ఉన్న పంటకు మొలక వచ్చి తిరిగి పంట విస్తీర్ణం పెరిగి దిగుబడి  కూడా పెరిగే అవకాశాలుంటాయి. దాంతో మార్కెట్ ధరకు అనుగుణంగా పంటను అమ్ముకునే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు. ఈ క్రమంలో అల్లం పంట సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించి దుక్కులు
 దున్నుతున్నారు.

సబ్సిడీతో ప్రోత్సాహం.. 
అల్లం పంటను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్ ధరకు అనుగుణంగా పంట సాగుపై కొంత మేర ఒడిదుడుకులు జరిగాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. మార్కెట్​లో అల్లం పంటకు బాగా డిమాండ్ పెరిగింది. అందుకే రైతులు ఉత్సాహంగా ఈ పంటను వేసేందుకు ముందుకు వస్తున్నారు. విత్తనాలకు సబ్సిడీ ఇస్తున్నాం.

రైతులు కొనుగోలు చేసే విత్తనాలకు సంబంధించిన రసీదులు జాగ్రత్తగా భద్రపరచుకొని దరఖాస్తు చేసుకోవాలి.  సబ్సిడీ విషయమై ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అమలు చేస్తాం.-సోమేశ్వర్ రావు,  జిల్లా ఉద్యానవన అధికారి