ఎన్‌పీఏ డైరెక్టర్‌‌గా సుజిత్‌ పాండే నియామకం

ఎన్‌పీఏ డైరెక్టర్‌‌గా సుజిత్‌ పాండే నియామకం
  • ఆయన స్థానంలో యూపి కేడర్‌‌కు చెందిన సుజీత్ పాండే నియామకం

హైదరాబాద్‌,వెలుగు: రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) డైరెక్టర్‌గా 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుజీత్ పాండేను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్‌ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన సుజీత్ పాండే 2028 జూలై 31 వరకు ఎన్‌పీఏ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. 1968 ఆగస్టు 1న బీహార్‌లోని పాట్నాలో జన్మించిన ఆయన 1994లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన లక్నో పోలీస్ కమిషనర్‌గా, సీబీఐ అకాడమీ డైరెక్టర్‌గా, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.