- ఆయిల్ ట్యాంకర్‌లో భారీగా చెలరేగిన మంటలు
- ఇరాన్ దాడి చేసిందని ఆరోపించిన అమెరికా
దుబాయ్: హార్మూజ్ జలసంధి గుండా వెళుతున్న ఒక ఆయిల్ ట్యాంకర్, మరో వాణిజ్య నౌకపై క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఒమన్‌లోని లిమాకు సమీపంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తుండగా ఒక ఆయిల్ ట్యాంకర్ ఎడమ భాగంలో (పోర్ట్ సైడ్) దాడి జరిగిందని మంగళవారం యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీవో) వెల్లడించింది. క్షిపణి దాడితో ఆ షిప్పులో భారీగా మంటలు చెలరేగాయని, అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా పర్యావరణ నష్టం జరగలేదని తెలిపింది.
ఈ ప్రాంతం గుండా వెళ్లే నౌకలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే, ఈ దాడి ఇరాన్ మిలిటరీ పనేనని అమెరికాకు చెందిన ఇద్దరు అధికారులు ఆరోపించారని ‘ఆక్సియోస్’ వార్తా సంస్థ పేర్కొంది. సోమవారం రాత్రి హార్మూజ్ జలసంధిలో రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ మిలిటరీ క్షిపణులను ప్రయోగించిందని చెప్పారని తెలిపింది. యూకేఎంటీవో పేర్కొన్న ట్యాంకర్ కూడా ఇరాన్ క్షిపణి దాడికి గురైన నౌకలలో ఒకటి అని ఒక అమెరికా అధికారి తెలిపారు. ఈ రెండు నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.
కాగా, అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా, ఇటీవల హార్మూజ్‌లో మళ్లీ పరస్పర దాడులు జరిగాయి. దీంతో హార్మూజ్ జలసంధిలో దాడులను నిలిపివేయడానికి అమెరికా, ఇరాన్ మధ్య ఒక వారం ఒప్పందం కుదరగా, అది ముగిసిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లక్ష్యాలపై ప్రతీకార దాడులు చేపట్టేందుకు అమెరికా ఇప్పుడు సిద్ధంగా ఉందని ఆక్సియోస్ తెలిపింది. కాగా, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ భౌతికకాయానికి వారం రోజుల అంతిమయాత్ర తర్వాత గురువారం అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో హార్మూజ్‌లో దాడుల నిలిపివేతకు నిర్ణయించారు. ఖమేనీ భౌతికకాయాన్ని సోమవారం టెహ్రాన్ నుంచి పవిత్ర నగరమైన కోమ్‌కు తరలించారు.
