మెస్సీ మ్యాజిక్‌‌.. క్వార్టర్స్‌‌లోకి అర్జెంటీనా .. తొలి పెనాల్టీ మిస్ చేసినా అదరగొట్టిన మెస్సీ

మెస్సీ మ్యాజిక్‌‌.. క్వార్టర్స్‌‌లోకి అర్జెంటీనా .. తొలి పెనాల్టీ మిస్ చేసినా అదరగొట్టిన మెస్సీ
  • ఈజిప్ట్‌‌పై 3-2 తేడాతో విజయం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్స్
  • చివరి నిమిషంలో విన్నింగ్‌‌ గోల్‌‌ కొట్టిన ఫెర్నాండెజ్

ఫిఫా ప్రపంచకప్  ప్రిక్వార్టర్స్​​లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఓటమి అంచుల్లో నుంచి బయటపడింది. ఈజిప్ట్‌‌పై 3-2 తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించి క్వార్టర్‌‌ ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. లియోనెల్ మెస్సీ ఒక గోల్, ఒక అసిస్ట్‌‌తో అర్జెంటీనా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

అట్లాంటా: ఫిఫా ప్రపంచకప్– 2026 రౌండ్ ఆఫ్ 16 (ప్రిక్వార్టర్స్)లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఓటమి అంచుల్లో నుంచి బయటపడింది. అసాధారణ పోరాట పటిమతో క్వార్టర్‌‌ ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలోని మెర్సిడెస్- బెంజ్ స్టేడియంలో మంగళవారం ఈ మ్యాచ్‌‌ జరిగింది. అత్యంత ఉత్కంఠభరిత ఈ నాకౌట్ మ్యాచ్‌‌లో ఒక దశలో 0–2తో వెనుకబడిన అర్జెంటీనా.. చివరి 13 నిమిషాల్లో మూడు గోల్స్ కొట్టి ఫుట్‌‌బాల్ చరిత్రలోనే నిలిచిపోయే కంబ్యాక్ విజయాన్ని నమోదు చేసింది. 

మ్యాచ్ ఆరంభం నుంచే ఈజిప్ట్ దూకుడుగా ఆడింది. మ్యాచ్ 15వ నిమిషంలోనే ఈజిప్ట్ డిఫెండర్ యాసర్ ఇబ్రహీం హెడ్డర్ ద్వారా సూపర్ గోల్ కొట్టి జట్టుకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 20వ నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ లభించినా.. కెప్టెన్ లియోనెల్ మెస్సీ కొట్టిన షాట్‌‌ను ఈజిప్ట్ గోల్‌‌ కీపర్ మోస్తఫా షోబీర్ అద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. దీంతో అర్జెంటీనా తీవ్ర ఒత్తిడిలో పడింది. రెండో అర్ధభాగంలో 67వ నిమిషంలో ఈజిప్ట్ స్ట్రైకర్ మోస్తఫా జికో మరో గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 2–0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంటి ముఖం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది.  

చివరి 13 నిమిషాలు ఉత్కంఠ

ఓటమి ఖాయమనుకున్న తరుణంలో అర్జెంటీనా పట్టువదలకుండా పోరాడింది. 79వ నిమిషం మెస్సీ అందించిన ఫ్రీ కిక్‌‌ను డిఫెండర్ క్రిస్టియన్ రొమేరో బుల్లెట్ హెడ్డర్ ద్వారా గోల్‌‌గా మలిచి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. పెనాల్టీ మిస్ చేసిన పట్టుదలతో ఆడిన లియోనెల్ మెస్సీ 83వ నిమిషంలో గొంజాలో మోంటీల్ పాస్‌‌ను మెరుపు వేగంతో గోల్ పోస్ట్‌‌లోకి పంపి స్కోరును 2–2తో సమం చేశాడు. 

మ్యాచ్ ఎక్స్‌‌ట్రా టైమ్‌‌కు వెళ్తుందనుకున్న తరుణంలో, ఇంజ్యూరీ టైమ్ (90+2)లో అర్జెంటీనా మిడ్‌‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ అద్భుతమైన గోల్ సాధించి అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని(3–2) అందించాడు. ఈజిప్ట్ ఆటగాళ్లు చివరి వరకు అసాధారణ పోరాటం చేసినప్పటికీ డిఫెండింగ్ ఛాంపియన్ల అనుభవం ముందు తలవంచక తప్పలేదు. చివరి నిమిషాల్లో తడబడటంతో టోర్నీకి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఈ విజయంతో ప్రపంచకప్ చరిత్రలో రెండు గోల్స్ వెనుకబడిన స్థితి నుంచి విజయం సాధించిన అరుదైన ఘనతను అర్జెంటీనా దక్కించుకుంది.