న్యూఢిల్లీ: వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాఫ్‌లో మార్పులు చేపట్టింది. శ్రీలంక లెజెండ్ ప్లేయర్ చమిందా వాస్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. మునాఫ్ పటేల్ స్థానంలో వాస్ ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. టెస్ట్‌ల్లో 355, వన్డేల్లో 400 వికెట్లు తీసిన వాస్.. గతంలో లంక జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్లో 2008 నుంచి 2010 వరకు డెక్కన్ చార్జర్స్ తరఫున ఆడిన అనుభవం ఉంది.
హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్‌లో వాస్ చేరాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇప్పటికే అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఐపీఎల్లో తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న డీసీ 2020లో ఫైనల్ చేరినా కల నెరవేర్చుకోలేకపోయింది. గత రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలమైంది.
