లాస్ వెగాస్: ఇండియా రెజ్లర్ అమృత పూజారి.. అండర్–23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. శనివారం జరిగిన విమెన్స్ 72 కేజీల ఫైనల్లో అమృత ‘బై ఫాల్’ ద్వారా ఇరినా జబ్లోట్స్కా (ఉక్రెయిన్) చేతిలో ఓడి రెండో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఉక్రెయిన్ రెజ్లర్ నిర్ణయాత్మక పిన్‌తో గోల్డ్ మెడల్‌ను ఖాయం చేసుకునే టైమ్‌కు అమృత 0–6తో వెనకబడి కోలుకోలేకపోయింది.
53 కేజీల కాంస్య పతక పోరులో స్వీటీ 0–11తో అనస్థాసియా పోల్స్కా (ఉక్రెయిన్) చేతిలో పరాజయంపాలైంది. రెపిఛేజ్ రౌండ్లో వైష్ణవి పాటిల్ కూడా 2–4తో హరుకా కోబార్ (జపాన్) చేతిలో కంగుతిన్నది. మెన్స్ విభాగంలో ఫ్రీస్టయిల్ రెజ్లర్లు నిరాశపర్చారు. బరిలోకి దిగిన ఐదుగురు రెజ్లర్లు పతక పోరుకు అర్హత సాధించలేకపోయారు. వైభవ్ పాటిల్, ఆదర్శ్ పాటిల్, అమిత్, నిఖిల్, రోనక్ దహియా తమ విభాగాల్లో ఓటమిపాలయ్యారు.
