హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ఫ్లడ్‌లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ఫ్లడ్‌లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి
  • ఆమె చెల్లి మీనాకు తీవ్ర గాయాలు
  • ఆస్పత్రిలో చేరిన మరో పది మంది విద్యార్థులు
  • నాదర్‌‌‌‌‌‌‌‌గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘటన 

 

హైదరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నాదర్‌‌‌‌‌‌‌‌గుల్‌‌‌‌‌‌‌‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన దాండియా, బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఈదురుగాలులకు ఫ్లడ్ లైట్ల స్టాండ్ కూలి విద్యార్థులపై పడింది. ఈ ప్రమాదంలో బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సోనా మృతిచెందగా, ఆమె చెల్లి మీనాకు తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఫ్లడ్ లైట్ల స్టాండ్ కూలి..

ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో శనివారం సాయంత్రం దాండియా వేడుకలను క్రియ ఆర్గనైజేషన్ నిర్వహించింది. కాలేజీ విద్యార్థులు, వారి స్నేహితులు కలిపి సుమారు 700 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుక కోసం భారీ లైటింగ్ సెట్లు, రెండు ఫ్లడ్ లైట్ల స్టాండ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు దాండియా ఆడుతుండగా రాత్రి 7.25 గంటల సమయంలో వీచిన ఈదురుగాలులకు ఒక స్టాండ్ కూలిపోయింది. దీంతో లైట్లు, ఇనుప రాడ్లు అక్కడున్న విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆస్పత్రికి, ఇతర క్షతగాత్రులను సమీపంలోని ఇతర హాస్పిటళ్లకు తరలించారు.

అక్క మృతి.. చెల్లికి గాయాలు

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన  వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సోనా మృతిచెందింది. అదే కాలేజీలో చదువుతున్న ఆమె చెల్లి మీనా తలకు గాయాలయ్యాయి. వీరిద్దరూ నెల రోజుల క్రితమే కాలేజీలో చేరినట్లు తెలిసింది. స్టాండ్ కూలిన సమయంలో జరిగిన తొక్కిసలాటలోనూ పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.