ప్రొటోకాల్ పాటించకపోతే ఢిల్లీకి పిలిపిస్తా: దిశ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఫైర్

ప్రొటోకాల్ పాటించకపోతే ఢిల్లీకి పిలిపిస్తా: దిశ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఫైర్

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్‌‌ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రివిలేజ్  మోషన్  పెట్టి ఢిల్లీకి పిలిపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ హెచ్చరించారు.

మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన దిశ సమావేశంలో కలెక్టర్ కె.హరిత, సిర్పూర్, ఆసిఫాబాద్  ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్ బాబు, కోవ లక్ష్మి, ఐటీడీఏ పీవో నంద మకరందుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రొటోకాల్‌‌ను ఉల్లంఘించిన అధికారులపై  ప్రివిలేజ్  మోషన్  పాస్  చేసి కోర్టు బోనులో నిలబెడతానని హెచ్చరించారు. 

వారానికోసారి అధికారులను ఢిల్లీకి పిలిపించి సమాధానం చెప్పే పరిస్థితి తీసుకొస్తానని తెలిపారు. అనంతరం పలు అంశాలపై రివ్యూ చేసి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇదిలాఉంటే తాను ఫోన్  చేస్తే డీఎంహెచ్ వో లిఫ్ట్  చేయడం లేదని ఆసిఫాబాద్  ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్​వోతో పాటు జీజీహెచ్  సూపరింటెండెంట్ ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్  చేశారు.