చేతబడి లేదు.. గీతబడి లేదు.. కోడిగుడ్లు, నిమ్మకాయలను తీసిపడేసిన భైంసా రూరల్ ఎస్సై సుప్రియ !

చేతబడి లేదు.. గీతబడి లేదు.. కోడిగుడ్లు, నిమ్మకాయలను తీసిపడేసిన భైంసా రూరల్ ఎస్సై సుప్రియ !

భైంసా: మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించడంలో భైంసా రూరల్ ఎస్సై సుప్రియ ఆదర్శంగా నిలిచారు. ఆమె పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో.. ఎవరో గుర్తుతెలియని ఒక ప్యాంటుపై అన్నం కలిపి, ఆ అన్నం ముద్దలపై పసుసు కుంకుమ చల్లి.. నిమ్మకాయలు, కోడిగుడ్లు ఉంచారు. 

ఈ పరిణామంతో గ్రామస్తులు హడలెత్తిపోయారు. ఎవరికో చేతబడి చేశారని ఊరంతా కలకలం రేగింది. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాట్టోలి గ్రామంలో చేతబడి కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఒక ప్యాంటు, ఇస్తారాకులో ముగ్గు వేసి నిమ్మకాయాలు పెట్టి ప్రజలకు భయబ్రాంతులకు గురి చేశారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భైంసా రూరల్ ఎస్సై సుప్రియ మూఢ నమ్మకాలు, చేతబడులపై అవగాహన కల్పించారు. అంతేకాదు.. ఆ ప్యాంటును, ప్యాంటుపై ఉంచిన అన్నం ముద్దలను, నిమ్మకాయలను, కోడిగుడ్లను ఆమెనే చేతులతో తీసేశారు.

ఈ సందర్భంగా.. చేతబడి, మూఢనమ్మకాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఆరోగ్యం బాగా లేకుంటే వైద్యుడిని సంప్రదించాలి కానీ మూఢనమ్మకాలపై ఆధారపడద్దని గ్రామస్తులకు సూచించారు. నేరాల నివారణ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. గ్రామ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులకు సూచించారు.