ఫలించిన తెలంగాణ ఎంపీల పోరాటం.. తాడిచర్ల బ్లాక్2 మైన్ సింగరేణికే కేటాయించిన కేంద్రం

ఫలించిన తెలంగాణ ఎంపీల పోరాటం.. తాడిచర్ల బ్లాక్2 మైన్ సింగరేణికే కేటాయించిన కేంద్రం

పెద్దపల్లి జిల్లా: తెలంగాణ ఎంపీల పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తాడిచర్ల బ్లాక్​2 మైన్ సింగరేణికే కేటాయించింది. తాడిచర్ల బ్లాక్​2 మైన్ను సింగరేణికే కేటాయించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. కేంద్ర బొగ్గు గని కార్మిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన పలుసార్లు లేఖలు కూడా రాశారు.

కేంద్ర ప్రభుత్వంపై తాము ఒత్తిడి చేయడంతోనే ఇది సాధ్యమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎంపీల డిమాండ్తోనే సాధ్యమైందని  స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే మీడియాకి తెలిపారు.

సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో సింగరేణిని అభివృద్ధి దిశలో తీసుకు వెళ్లడానికి కృషి చేస్తానని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. తాడిచర్ల బ్లాక్​2 మైన్తో పెద్దపల్లి ప్రాంత ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన చెప్పారు. తాడిచర్ల బ్లాక్​2 మైన్ను సింగరేణికి కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బొగ్గు గనులను నేరుగా సింగరేణికే కేటాయించాలన్న డిమాండ్ను కేంద్రం అంగీకరించకపోవడంతో వేలంలో సింగరేణి పాల్గొనేలా అనుమతించాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి వివేక్​, ఎంపీ వంశీకృష్ణ పలుమార్లు ప్రధాని నరేంద్రమోదీ, బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రిని కలిసి నేరుగా బొగ్గు బ్లాక్లు సింగరేణికి కేటాయించాలని కోరారు. దాంతో పాటు బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్​ఇచ్చింది.

దీంతో సింగరేణి తాజాగా చత్తీస్​​గఢ్​లోని 'తార', తెలంగాణలోని మణుగూరు ఓసీ-2 డిప్​సైడ్​ ఎక్స్​టెన్షన్​ మైన్​లకోసం టెండర్లు వేసింది. బీజేపీ కూడా ఈ మధ్య సింగరేణి ప్రాంతం మీద దృష్టి సారించింది. ఆ పార్టీ లోకల్ లీడర్లు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డిని కలిసి బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికి కేటాయించాలని కోరుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలోనే నాలుగు రోజులు కింద సింగరేణి భవన్​లో కేంద్రమంత్రి సింగరేణి యాజమాన్యంతో చేసిన సమీక్షలో రెండు గనులను నేరుగా కేటాయించే చాన్స్​ ఉందని ప్రకటించారు. ఆమేరకు తాజాగా తాడిచర్ల బ్లాక్​2ను సింగ రేణికి కేటాయించినట్లు కిషన్​రెడ్డి చేసిన ప్రకటనతో కోల్​బెల్ట్​వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది.