- ఇద్దరు కూలీలు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
కాగజ్ నగర్, వెలుగు: అటవీ శాఖ పనులకు సిమెంట్ పోల్స్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు స్తంభాల కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది.
ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలానికి చెందిన 8 మంది కూలీలు ట్రాక్టర్ లో సిమెంట్ ఫెన్సింగ్ పోల్స్ లోడ్ వేసుకొని కర్జవెల్లి ఫారెస్ట్ రేంజ్ పనులకు బయలుదేరారు. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా నడపడంతో చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాలీలో ఉన్న సిమెంట్ పోల్స్ కూలీలపై పడిపోయాయి.
చల్లా అశోక్(52), పండిత్ (58) పోల్స్ కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు. భీంరావు, రాము తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ సాదిక్ షేక్ కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ ఇంజన్‌పై డ్రైవర్ తో కలిపి నలుగురు ఉండగా, ట్రాలీలో నలుగురు కూలీలు సిమెంట్ పోల్స్‌పై కూర్చున్నట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్సై అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పాలకుర్తిలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి
జనగామ జిల్లా పాలకుర్తిలో కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి పాలకుర్తి నుంచి స్టేషన్ ఘన్‌పూర్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు స్థానిక సోమేశ్వర టెంపుల్ ఆర్చి గేట్ ముందు గూడోల్లగూడెం నుంచి రఘునాథపల్లి మండలం వెల్దిటి గ్రామానికి బైక్ వెళ్తున్న దంపతులను ఢీకొట్టగా వెంకట లక్ష్మి(50) అక్కడికక్కడే చనిపోయింది.
అక్కడ ఆపకుండా అదే స్పీడ్‌తో వెళ్లిన ఇన్నోవా గూడూరు గ్రామంలో చిల్పూరు మండలం కిష్టాజిగూడెం గ్రామానికి చెందిన వడ్లకొండ రంజిత్(32)ను ఢీకొట్టగా అతను స్పాట్ లోనే చనిపోయాడు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ చీపురు రాహుల్ను బమ్మెర గ్రామం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
