గచ్చిబౌలి–మియాపూర్ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు..శరత్ సిటీ క్యాపిటల్మాల్ దగ్గర నరకమే..!

గచ్చిబౌలి–మియాపూర్ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు..శరత్ సిటీ క్యాపిటల్మాల్ దగ్గర  నరకమే..!

హైదరాబాద్​ లో పీక్​ టైంలో  రోడ్లపై ప్రయాణించాలంటే చుక్కలు కనపడతాయి.  అదే వీకెండ్​ అయితే  ట్రాఫిక్​ కష్టాలు మామూలుగా ఉండవు.  కిలో మీటరు దూరం ప్రయాణించాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సిదే.  గచ్చిబౌలి–మియాపూర్​ కారిడార్​ ఏరియాలోని  శరత్​ సిటీ క్యాపిటల్​​ మాల్ పరిధిలోని ట్రాఫిక్​ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఈ ఏరియాలో అండర్​ పాస్​.. స్కైవాక్​ నిర్మిచాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

వీకెండ్​.. హాలిడేస్​ రోజుల్లో ఈ ఏరియాకు లక్షల మంది వస్తుంటారు.  ఆరు లైన్ల రోడ్​ ఉన్న కొండాపూర్​  శరత్​ సిటీ క్యాపిటల్​​ మాల్​ ఏరియాలో షాపులకు వచ్చే వాహనాల పార్కింగ్​ చేయడం వలన రెండు లైన్లకే పరిమితమవుతుంది. బస్​లు.. ప్రైవేట్​ వాహనాల్లో ప్రయాణికులు ఎక్కి.. దిగేందుకు తగినంత స్పేస్​ లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. వంద మీటర్లు ప్రయాణించాలంటే రెండు గంటల సమయం పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. 

ట్రాఫిక్​ సమస్యపరిష్కారం కావాలంటే  శరత్​ సిటీ క్యాపిటల్​​ మాల్ క్లోజ్​ చేయాలని సైబరాబాద్​ అధికారులు మాల్​ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.  ఈ ఏరియాలో లక్షలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.   గతేడాది మాల్ పార్కింగ్ ప్రాంతాన్ని ప్రధాన రహదారితో కలుపుతూ 22 అడుగుల వెడల్పు గల అండర్‌పాస్‌ను నిర్మించారు.  అయినప్పటికీ  మాల్ గేట్​ నుంచి  బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు.. అక్కడి నుండి రాడిసన్ హోటల్ వరకు ట్రాఫిక్ కు నిరంతరం అంతరాయం కలుగుతుంది.
షాపింగ్​ మాల్​ఎంట్రన్స్​ దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉండటంతో ట్రాఫిక్​ అంతరాయం కలుగుతుంది. రద్దీ సమయాల్లో మాల్ బయట ఉన్న మార్గాన్ని దాటడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.

 శరత్​ సిటీ క్యాపిటల్​​ మాల్ దగ్గర ట్రాఫిక్​ పరిస్థితిని గమనించిన అధికారులు..పరిష్కారం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు కొన్ని రోజులుగా  పలు సంయుక్త తనిఖీలు నిర్వహించారు.  గతేడాది నిర్మించిన అండర్‌పాస్ ఈ  ప్రాంతంలో రద్దీని తగ్గించిందని, కానీ మాల్ వెలుపల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అధికారులు తెలిపారు.