పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది. 12 ఏళ్ల ఓ అమాయక బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఆ ప్రాంతంలో ఎంతటి అగ్గి రాజేసిందంటే... ఆగ్రహంతో ఊగిపోయిన జనం ఒక నిర్దోషిని కొట్టి చంపేశారు. చివరకు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
అదృశ్యమైన చిన్నారి.. చెరువులో శవమై...
జూలై 5వ తేదీ ఆ కుటుంబానికి ఎప్పటికీ మర్చిపోలేని ఒక చీకటి రోజు. 12 ఏళ్ల ఓ చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కన్నవారు గుండెలు బాదుకుంటూ వెతికారు. కానీ, చివరికి బరుయిపూర్‌లోని ఒక చెరువులో సంచిలో కుక్కి ఉన్న ఆ చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఆ పసి ప్రాణాన్ని దారుణంగా అత్యాచారం చేసి, ప్రాణాలు తీశారని తెలియడంతో స్థానికుల గుండెలు మండిపోయాయి. పోలీసులు వెంటనే స్పందించలేదంటూ జనం రోడ్లపైకి వచ్చారు. టైర్లు తగలబెడుతూ, పోలీసు వాహనాలను ధ్వంసం చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు.
ఆవేశంలో జరిగిన ఘోరం.. బలైన నిర్దోషి
చిన్నారి మరణం కలిగించిన కోపం, స్థానికుల్లో ఎంతటి కసిని నింపిందంటే... ఈ పాపానికి కారణం అతనే అనుకుంటూ 'ఇంద్రజిత్ మోండల్' అనే వ్యక్తిపై ఓ గుంపు దారుణంగా దాడి చేసి, కొట్టి చంపేసింది. కానీ ఆ తర్వాత బాలిక అత్యాచారం, హత్యతో ఇంద్రజిత్‌కు ఎలాంటి సంబంధం లేదని, అతను పూర్తిగా నిర్దోషి అని పోలీసులు తేల్చారు.
సీన్ రీ-కన్స్ట్రక్షన్.. నిందితుడి ఎన్‌కౌంటర్!
ఈ కేసులో అసలు నిందితుడైన ప్రభాష్ మోండల్‌తో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 12.45 గంటల సమయంలో... సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి (సీన్ రీ-కన్స్ట్రక్షన్) పోలీసులు ప్రభాష్‌ను ఆ చెరువు దగ్గరికి తీసుకువెళ్లారు.
కానీ, అక్కడ నిందితుడు ఓ పోలీసు అధికారి దగ్గరున్న తుపాకీని లాక్కొని, పోలీసులపైనే కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించాడు. దింతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడంతో ప్రభాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
బాధిత కుటుంబాలకు భరోసా
ఈ ఘోరం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి స్వయంగా రంగంలోకి దిగి.. బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించారు."పోలీసులు ఈ కేసులో చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే వదిలిపెట్టేది లేదు. 72 గంటల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించాను" అని సీఎం స్పష్టం చేశారు.
మూకదాడిలో చనిపోయిన అమాయకుడు ఇంద్రజిత్ మోండల్ కుటుంబానికి కూడా పూర్తి న్యాయం చేస్తామని, ఆ దాడికి పాల్పడిన వారిపై హత్య కేసులు పెడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన దాదాపు 200 మందిని గుర్తించి అరెస్ట్ చేస్తామని, హింసను ప్రేరేపించిన వారిని వదిలిపెట్టబోమని చెప్పారు.
చివరగా ఒక పసి ప్రాణం దారుణంగా గాల్లో కలిసిపోవడం... ఆ ఆవేశంలో మరొక అమాయకుడు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. నిందితుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పటికీ... పోయిన ఆ రెండు ప్రాణాలు తిరిగిరావు కదా అంటూ స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు.
