ఆటో స్పేర్స్ ఇండస్ట్రీకి అపార అవకాశాలు.. 8–10 శాతం వృద్ధి సాధ్యమని అంచనా

ఆటో స్పేర్స్ ఇండస్ట్రీకి అపార అవకాశాలు.. 8–10 శాతం వృద్ధి సాధ్యమని అంచనా

న్యూఢిల్లీ:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఆటోమొబైల్ విడిభాగాల రంగం 8 నుంచి 10 శాతం వరకు వృద్ధిని నమోదు చేయగలదని పరిశ్రమల సంస్థ ఏసీఎంఏ తెలిపింది. దేశీయంగా మంచి డిమాండ్, బలమైన ఎగుమతులు ఈ వృద్ధిని నడిపిస్తాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమ రూ.7.60 లక్షల కోట్ల టర్నోవర్​తో 12.7 శాతం వృద్ధి సాధించింది. 

గత రెండేళ్లలో మొదటిసారిగా ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు ఏర్పడింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వాహనాల విడిభాగాల దిగుమతుల్లో చైనా 36 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా నగరాల్లో జీవన వ్యయం పెరిగి కార్మికులు స్వగ్రామాలకు తరలిపోవడంతో పరిశ్రమ కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నది. 

గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ఐదు శాతం పెరిగి రూ.2,12,176 కోట్లకు చేరాయి. దిగుమతులు 13 శాతం పెరిగి రూ.2,24,287 కోట్లకు చేరుకున్నాయి. ఇవి అడ్వాన్స్​డ్​ టెక్నాలజీస్ అవసరాల కోసం జరిగాయి. దేశీయ అవసరాల సరఫరాలో కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వం కార్బన్ న్యూట్రాలిటీపై దృష్టి పెట్టడం ఆటో స్పేర్​పార్ట్స్​ రంగానికి సానుకూలంగా మారింది.