మాతాశిశు మరణాలను అరికట్టాలి : నిజామాబాద్ కలెక్టర్ఇలా త్రిపాఠి

మాతాశిశు మరణాలను అరికట్టాలి : నిజామాబాద్ కలెక్టర్ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో మాతాశిశు మరణాలు ఎట్టిపరిస్థితుల్లోనూ జరగొద్దని నిజామాబాద్​కలెక్టర్​ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్​లో వైద్యారోగ్యశాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. సర్కారు దవాఖానాల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, గర్భిణుల నమోదు నుంచి సుఖప్రసవం జరిగే దాకా ఎప్పటికప్పుడు హెల్త్​ చెకప్​ చేయాలని ఆదేశించారు. రక్తహీనత, హైరిస్క్​ పేషెంట్ల పట్ల మరింత అలర్ట్​గా ఉండాలన్నారు. ఐసీడీఎస్, మెడికల్​ స్టాఫ్​కలిసి సమన్వయంతో పనిచేసి మాతాశిశు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

బాల్య వివాహాలు, మేనరికపు పెళ్లిళ్ల నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఫ్యామిలీ వెల్ఫేర్​ గవర్నింగ్ కౌన్సిల్ ​చైర్​పర్సన్ డాక్టర్​ కవితారెడ్డి, డీఎంహెచ్​వో రాజశ్రీ తదితరులు ఉన్నారు. జక్రాన్​పల్లి మండలం మునిపల్లిలోని జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్​ గర్ల్స్​రెసిడెన్షియల్​ కాలేజీని కలెక్టర్​తనిఖీ చేశారు.