పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన పాత నేరస్థుడిని సీసీఎస్ సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ పరితోష్ పంకజ్వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కోటపల్లి చంద్రి అలియాస్ శేఖర్ (31) ప్రస్తుతం మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌లో నివసిస్తున్నాడు.
అతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తూనే 2007 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. అతడిపై వివిధ జిల్లాల్లో 106 కేసులు ఉండగా, అందులో ఒక పోక్సో కేసు కూడా ఉంది. గతంలో 19 సార్లు రిమాండ్‌కు వెళ్లి, 25కు పైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు. 2025 అక్టోబర్ 17న బెయిల్‌పై విడుదలైన మూడు రోజులకే మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడని విచారణలో తేలింది. తాళం వేసిన ఇండ్లే అతడి టార్గేట్‌గా ఉండేవి.
గత ఎనిమిది నెలల కాలంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు, దుండిగల్లో రెండు, గుమ్మడిదలలో మూడు, హత్నూరలో ఒకటి, పోచారం ఐటీ కారిడార్లో రెండు, మేడిపల్లిలో మూడు, పటాన్చెరులో రెండు కేసులతో పాటు అబ్దుల్లాపూర్మెట్, ఐడీఏ బొల్లారం, వనస్థలిపురం, జీనోమ్ వ్యాలీ, శామీర్‌పేట్, కీసర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. దొంగిలించిన బంగారు ఆభరణాల్లో కొంత విక్రయించి, మరికొంతను తాకట్టు పెట్టి వచ్చిన సొమ్మును విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది.
విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు బొంతపల్లి గ్రామ కమాన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 22.5 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీఅభినందించారు.
