ఆసిఫాబాద్, వెలుగు: ఏండ్ల కాలంగా సాగు చేసుకుంటున్న తమ పోడు భూముల్లో కందకాలు తవ్వొద్దని, తమను సాగు చేసుకోనివ్వాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సూర్దపూర్కు చెందిన పోడు రైతులు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వారికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు తెలిపారు. కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాలుగా సాగు చేస్తున్న పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వడం సరికాదన్నారు. అనంతరం డీఎఫ్ వో ఆఫీస్కు చేరుకుని డీఎఫ్వో బాలమణి వినతిపత్రం అందజేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో సాగుకు అవకాశం ఇవ్వాలని, వచ్చే ఏడాది రెవెన్యూ, ఫారెస్ట్ జాయింట్ సర్వే నిర్వహించాలని వారు కోరారు.
