- అత్యధికులు అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లే
- కొన్ని ఏరియాల్లో ఇళ్లలోకి ఒంటరిగా వెళ్లేందుకు భయం
- మెజార్టీ బీఎల్వోల చదువు టెన్త్లోపే
- జనం అడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్న బీఎల్వోలు
- చదువుకున్నోళ్లూ ఫారాలు తప్పుగా నింపుతున్నారని ఆవేదన
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో ఫీల్డ్ స్టాఫ్ గా ఉన్న బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో ఫారాలు ఇచ్చి ఎంత వివరంగా చెప్పినా చదువుకున్నోళ్లు కూడా తప్పుగా నింపి ఇస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వారికి సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడం, బీఎల్వోలంతా మహిళలే కావడంతో కొన్ని ఏరియాల్లో ఇళ్లలోకి ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు.
మెజార్టీ బీఎల్వోల చదువు టెన్త్ లోపే ఉండడంతో జనం అడిగే వివిధ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. అలాగే అడ్రస్ లో లేని ఓటర్లను ట్రేస్ చేయడం, వారికి ఫారాలు అందజేయడం కూడా వారికి సవాల్ గా మారింది. బీఎల్వోలకు సాయంగా టీచర్లను లేదంటే పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు, గ్రామాల్లో జీపీఓలు/పంచాయతీ సెక్రటరీలను అటాచ్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. లేదంటే ఓటర్ల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు కాక గందరగోళం తలెత్తే ప్రమాదముందని బీఎల్వోలు హెచ్చరిస్తున్నారు.
సపోర్టింగ్ స్టాఫ్ లేక తిప్పలు..
ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు అందించి, తిరిగి కలెక్ట్ చేసుకునే పనిని రాష్ట్ర ఎన్నికల సంఘం అంగన్ వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు అప్పజెప్పింది. ఒక్కొక్కరి పరిధిలో 1,200 మంది ఓటర్లు ఉండగా.. వారందరి ఇంటి నంబర్ అడ్రస్ కనిపెట్టడం సవాల్ గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇబ్బంది లేకున్నా.. అర్బన్ ఏరియాల్లో మాత్రం ఇళ్లు వెతుక్కోవడమే పెద్ద టాస్క్ గా మారింది. ఆయా రాజకీయ పార్టీలు బీఎల్ఏలను ప్రకటించినప్పటికీ.. బీఎల్వోలకు వారి సహకారం అంతంత మాత్రంగానే ఉంది.
అన్ని ఇళ్లకు ఒక్కరే తిరగాల్సి రావడం, సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడం, అందులోనూ బీఎల్వోలంతా మహిళలే కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వీరికి ఎలాంటి సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించకపోవడంతో కొన్ని ఏరియాలకు, ఇళ్లకు ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు.
ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. అంగన్ వాడీ కేంద్రాల్లో పని చేసే ఆయాలను సాయంగా తీసుకెళ్లండని అధికారులు సూచిస్తుండగా.. వారిని తీసుకెళ్తే అంగన్ వాడీ సెంటర్ ను పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని అంగన్ వాడీ టీచర్లు చెబుతున్నారు. అంతేగాక 50, 60 ఏళ్ల మధ్య ఉన్న ఆయాలు ఇంటింటికీ నడిచి తిరగడానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.
యాప్‌ల నిర్వహణ భారమే..
సర్ విధుల్లో ఉన్న మెజార్టీ అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల చదువు టెన్త్ లోపే ఉంది. కానీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎన్నికల సంఘం ప్రతి చిన్న మార్పును ఆన్‌లైన్ యాప్‌ల ద్వారానే నమోదు చేయాలని నిబంధన పెట్టింది.
చదువుకున్న విద్యావంతులే ఫారాలు(ఫామ్ 6, 7, 8) నింపడంలో గందరగోళానికి గురవుతున్నారని, అలాంటిది తమకు సరైన శిక్షణ ఇవ్వకుండా ఆన్‌లైన్ డేటా ఎంట్రీలు చేయమనడం ఎంత వరకు సమంజసమని బీఎల్వోలు ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల జాబితాలో మార్పులపై జనం అడిగే సాంకేతిక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
టార్గెట్ చేరుకోకపోతే.. షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు
అంగన్‌వాడీ టీచర్లు అంగన్ వాడీ పరిధిలో పిల్లల, గర్భిణుల ఆరోగ్య సేవలు చూసుకోవాలి. ఆశాలు గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తుంటారు. దీనికితోడు బీఎల్వోలుగా ఇంటింటి సర్వే చేసి, ఫారాలను సేకరించి డిజిటలైజ్ చేయడం వారికి కష్టతరంగా మారింది.
తమ రెగ్యులర్ అంగన్‌వాడీ విధులు, గర్భిణులు-బాలింతల పోషణ సంరక్షణ చూసుకుంటూనే, మరోవైపు ఈ అదనపు ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించడం ఇబ్బందికరంగా మారింది. అయినా ఉన్నతాధికారులు నిర్దేశిత గడువులోగా సర్వే, ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పూర్తి కాకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు సస్పెండ్ చేస్తుండడంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
