మిస్సింగ్..మిస్టరీ.. ఇంటర్ అమ్మాయి అదృశ్యం.. మూడు రోజులైనా దొరకని ఆచూకీ

మిస్సింగ్..మిస్టరీ.. ఇంటర్ అమ్మాయి అదృశ్యం.. మూడు రోజులైనా దొరకని ఆచూకీ

కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి కేజీబీవీకి చెందిన ఇంటర్  స్టూడెంట్  మిస్సింగ్  మిస్టరీగా మారింది. ఆమె అదృశ్యమై మూడు రోజుల గడిచినా ఆచూకీ దొరక్కపోవడంతో పేరెంట్స్, టీచర్స్ తో పాటు తోటి స్టూడెంట్స్  టెన్షన్  పడుతున్నారు. మరోవైపు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత బెల్లంపల్లికి చెందిన సాయిశృతి ఇటీవల ఇంటర్(బైపీసీ) ఫస్టియర్ లో చేరింది. అందరితో సరదాగా కలిసిమెలిసి ఉంటున్న ఆమె శనివారం తెల్లవారుజామున అదృశ్యమైంది. ఆదివారం ఉదయం స్కూల్  సిబ్బంది గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్కూల్  ముందు వైపు సీసీ కెమెరాలు ఉండడంతో సాయిశృతి స్కూల్  వెనుక వైపు గోడ దిగి వెళ్లిపోయినట్లు పాదముద్రలను బట్టి గుర్తించారు. గతంలో తనకు వేములవాడకు వెళ్లాలని ఉన్నట్లు తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా గాలింపు చేపట్టారు. మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో విద్యార్థిని కోసం వెతుకుతున్నారు. 

ఈ క్రమంలో ఆదివారం రాత్రి జగిత్యాల నుంచి మంచిర్యాల వైపు బస్సులో వచ్చినట్లు ఆమె పక్క సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దాని ఆధారంగా మంచిర్యాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరా పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు క్లూ లభించలేదని సమాచారం. దీంతో సాయిశృతి ఎక్కడకు వెళ్లిందని ఆందోళన చెందుతున్నారు.