- ఆరుగురిపై కేసు నమోదు, ముగ్గురు అరెస్టు
కరీంనగర్/జమ్మికుంట, వెలుగు: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి శివారులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణాదారులు హల్ చల్ చేశారు. ఔట్ పోస్టులో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను మద్యం మత్తులో బూతులు తిడుతూ ఘర్షణకు దిగారు.
వారిని వీడియో తీస్తున్న వ్యక్తిని చితకబాది అతడి బైక్ లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురిని అరెస్ట్ చేశారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం.. మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ శివారులో పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో విలాసాగరం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సోమవారం రాత్రి చెక్ పోస్టుకు మద్యం మత్తులో చేరుకున్నారు. కొన్ని ట్రాక్టర్ల దగ్గర రూ.200 చొప్పున తీసుకుని వదిలేస్తున్నారని, తమ ట్రాక్టర్లను మాత్రం పోనివ్వడం లేదంటూ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగారు. కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ దౌర్జన్యానికి దిగారు. అదే సమయంలో అటుగా బైక్ పై వెళ్తున్న దొంగల రాజు అనే వ్యక్తి వీడియో తీశాడు.
దీంతో అతడిని వెంబడించి వెంకటేశ్వరపల్లి గ్రామశివారు వద్ద పట్టుకొని చితకబాది బైక్ ను లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు విలాసాగర్ గ్రామానికి చెందిన రాచపల్లి ప్రశాంత్, రాచపల్లి సమ్మయ్య, రాచపల్లి రాజును సైదాబాద్ ఎక్స్ రోడ్ లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చేసిన నేరాన్ని అంగీకరించడంతో పాటు బైక్ ను అప్పగించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
