మదనాపూరు/మక్తల్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగిస్తోందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం అమరచింత మండలంలో రూ.6.58 కోట్లతో చంద్రఘడ్, -నాగిరెడ్డిపల్లి, -బెక్కరపల్లి ఎత్తిపోతల పథకాల రిపేరు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన భవన నిర్మాణానికి రూ.85 లక్షలతో భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలు కడుతున్నా అభివృద్ధిని ఆపడం లేదని గుర్తుచేశారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామంలో జరిగిన గ్రామదేవత మారెమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
