భూదాన్ పోచంపల్లి, వెలుగు: భూదానోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మాజీ ఎమ్మెల్యే కళ్లెం పాపిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయి పళ్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాయ్, మాజీ ఎమ్మెల్యే కళ్లెం పాపిరెడ్డి విగ్రహాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరాంరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుడిలా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించిన గొప్ప నాయకుడు కళ్లం పాపిరెడ్డి అని కొనియాడారు. భూదాన్ పోచంపల్లి ప్రాంత ప్రజలకు భూదానోద్యమంలో భూములు పంచడంలో కీలక పాత్ర పోషించాడన్నారు. ఈ కార్యక్రమంలో కళ్లెం పాపిరెడ్డి కుటుంబ సభ్యులు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
