కరీంనగర్: జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్- ప్రారంభం

కరీంనగర్: జోనల్ స్థాయి  పోలీస్ డ్యూటీ మీట్- ప్రారంభం

కరీంనగర్, వెలుగు: పోలీసుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మరింత నైపుణ్యం సాధించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్​లో నిర్వహిస్తున్న 3వ జోనల్ లెవల్ పోలీస్ డ్యూటీ మీట్-ను సీపీ మంగళవారం ప్రారంభించారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబోటేజ్ చెక్, డాగ్ స్క్వాడ్ పోటీలు, కంప్యూటర్ అవగాహన, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంశాల్లో పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని మల్టీ జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు సీపీ తెలిపారు. 

జోన్-3 పరిధిలోని కరీంనగర్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి 91 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్న పోటీలు బుధవారంతో ముగియనున్నాయి. పోటీల్లో గోల్డ్ మెడలిస్టుకు రూ.3 లక్షలు, మూడు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు, సిల్వర్ మెడల్ విజేతలకు రూ.2 లక్షలు, రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు, బ్రాంజ్ మెడల్ విజేతలకు రూ.1 లక్ష, ఒక అడ్వాన్స్ ఇంక్రిమెంట్ అందజేయనున్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్ జి, వేణుగోపాల్, వెంకటస్వామి, ఇతర జిల్లాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.