చెరువులను కాపాడితేనే వరదలకు చెక్‌‌‌‌‌‌‌‌: హైడ్రా కమిషనర్ రంగనాథ్

చెరువులను కాపాడితేనే వరదలకు చెక్‌‌‌‌‌‌‌‌: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరాల్లో వరదల సమస్యకు చెరువులు, వరద కాలువల ఆక్రమణనే ప్రధాన కారణమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. సహజ నీటి ప్రవాహ మార్గాలు, గొలుసుకట్టు చెరువులను పరిరక్షిస్తే వరదలను నియంత్రించవచ్చని చెప్పారు. 

ముస్సోరీలోని లాల్‌‌‌‌‌‌‌‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం నిర్వహించిన ఐఏఎస్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ‘నగరాల్లో వరద ముప్పు నివారణ – విపత్తు నిర్వహణ వ్యూహాలు’ అంశంపై ఆయన ప్రసంగించారు.

బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో నీటి ప్రవాహ మార్గాలు, చెరువులు, నదుల భూములు ఆక్రమణకు గురికావడంతో వరదలు తీవ్రరూపం దాల్చాయని రంగనాథ్ వివరించారు. బెంగళూరులో కాలువలు కుంచించుకుపోవడం, అధిక కాంక్రీటీకరణ, ముంబైలో మిథి నది ఆక్రమణలు, పాత డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోవడం, ఢిల్లీలో యమునా వరద మైదానాల ఆక్రమణలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను విస్తరించకపోవడం ప్రధాన కారణాలని పేర్కొన్నారు. హైదరాబాద్ కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటోందని, అందుకే చెరువులు, వరద కాలువల పరిరక్షణకు హైడ్రా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.