జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో అసెస్‌మెంట్ కాపీపై కమిషనర్ సంతకం ఫోర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. మున్సిపల్ అసెస్‌మెంట్(ఆస్తి) రికార్డుల ప్రకారం 3-5--128 ఇంటి నంబర్ సమిండ్ల మల్లయ్య పేరుతో నమోదై ఉంది. ఈ ఇంటిపై 2011–12 నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరం వరకు రూ.52,356 ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు ఆన్‌లైన్ రికార్డులు చూపిస్తున్నాయి. అయితే గత జూన్ 25న డాక్యుమెంట్ నంబర్ 4239/2026 కింద పార్టిషన్ డీడ్ ద్వారా వారసులైన సమిండ్ల రాజేశ్, సమిండ్ల గంగరాజంకు రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలిసింది.
అనంతరం మున్సిపల్‌లో ఆటోమేటిక్ మ్యుటేషన్ ప్రక్రియ ద్వారా 3-5--128, 3--5--128/1/A/1 నంబర్లు కేటాయించారు. కానీ అసలు 3--5--128 అసెస్‌మెంట్‌పై ఇప్పటికీ రూ.52,356 ఆస్తి పన్ను బకాయి ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. పన్ను బకాయి ఉన్న అసెస్‌మెంట్‌లకు రిజిస్ట్రేషన్ జరగకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అందజేసిన సాఫ్ట్ కాపీలను పరిశీలించగా, కమిషనర్ సత్య ప్రణవ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, సంబంధిత ఆస్తిని 40 ఏళ్ల నాటి భవనంగా నమోదు చేసి రిజిస్ట్రేషన్ టాక్స్ నుంచి మినహాయింపు పొందినట్లు తెలుస్తోంది.
