ఇండోనేసియాకు భారత్‌‌‌‌‌‌‌‌ బ్రహ్మాస్త్రాలు .. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ద్వైపాక్షిక చర్చలు

ఇండోనేసియాకు  భారత్‌‌‌‌‌‌‌‌ బ్రహ్మాస్త్రాలు .. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ద్వైపాక్షిక చర్చలు
  •     బ్రహ్మోస్‌‌, అస్త్ర మిసైల్స్​ సరఫరాకు చరిత్రాత్మక ఒప్పందం
  •     ఇండోనేసియా పార్లమెంట్‌‌లో ప్రధాని మోదీ ప్రసంగం

ఇండోనేసియా పర్యటనలో ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోల మధ్య మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి చర్చలు సక్సెస్​ అయ్యాయి. భారత్ నుంచి అత్యాధునిక ‘బ్రహ్మోస్’ సూపర్‌‌‌‌‌‌‌‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులతోపాటు ‘అస్త్ర’ ఎయిర్ -టు-ఎయిర్ క్షిపణులను ఇండోనేసియాకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది.

జకార్తా: భారత్, ఇండోనేసియా దేశాల మధ్య సరికొత్త స్వర్ణయుగం ఆరంభమైంది. వ్యూహాత్మక ఇండో-–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా, రక్షణ తదితర రంగాల్లో ఇరు దేశాలు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. ఇండోనేసియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోల మధ్య మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి చర్చలు ఫలప్రదమయ్యాయి.

 భారత్ నుంచి అత్యాధునిక ‘బ్రహ్మోస్’,‘అస్త్ర’ క్షిపణులను ఇండోనేసియాకు సరఫరా చేసేందుకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో దాదాపు 600 మిలియన్ డాలర్ల విలువైన 2 భారీ రక్షణ ఎగుమతి ఒప్పందాలు ఖరారు కావడం విశేషం. 

14 కీలక ఒప్పందాలపై సంతకాలు

భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో బంధాన్ని పటిష్టం చేస్తూ మొత్తం 14 కీలక ఒప్పందాలు కుదిరాయి. క్షిపణుల సరఫరాతో పాటు ఇరు దేశాల కోస్ట్ గార్డ్‌‌లు కలిసి పనిచేయాలని, సముద్ర భద్రతను పర్యవేక్షించాలని నిర్ణయించారు. 

ఇందులో భాగంగానే.. భారత్‌‌కు చెందిన ‘ఇంటిగ్రేటెడ్ ఫ్యూజన్ సెంటర్ - ఇండియన్ ఓషన్ రీజియన్’లో ఇండోనేసియాకు చెందిన ఒక లైజన్ ఆఫీసర్‌‌ను నియమించనున్నారు. మలక్కా జలసంధి సమీపంలో, భారత గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు కేవలం 100 మైళ్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక ‘సబాంగ్ పోర్ట్’ను ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ‘యూపీఐ’ని త్వరలోనే ఇండోనేసియా పేమెంట్ సిస్టమ్‌‌తో అనుసంధానించనున్నారు. జకార్తాలో ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరు  క్యాంపస్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే అంతరిక్ష రంగంలో ఉమ్మడి పరిశోధనలకు ఇరు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

అభివృద్ధి పథాన్ని అనుసరిస్తం: మోదీ 

భారత్‌‌ ఎల్లప్పుడూ అభివృద్ధి పథాన్ని మాత్రమే అనుసరిస్తుందని, విస్తరణవాదాన్ని కాదని  ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక చొరబాట్లు, విస్తరణవాద ధోరణులపై ఆగ్నేయాసియా దేశాల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండోనేసియా పార్లమెంట్‌‌లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.